రాజకీయాలు..సినిమాలు 'మిక్స్' చేసిన పవన్ కళ్యాణ్
పవన్ దెబ్బకు 'టాలీవుడ్' విలవిల!
చిరంజీవి రిక్వెస్ట్..పవన్ కళ్యాణ్ ఛాలెంజ్
కీలక సమయంలో విజయవాడలో దీక్ష
వైసీపీ సర్కారుపై ఘాటు విమర్శలు
ఆర్ధిక మూలాలు దెబ్బకొట్టే ప్రయత్నం అంటూ ఆరోపణలు
టాలీవుడ్ లో కలకలం. పవన్ కళ్యాణ్ దెబ్బకు దిక్కుతోచని పరిస్థితి. అత్యంత కీలకమైన సంక్రాంతి సమయంలో విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలు ఉన్న వేళ జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ అమరావతి వేదికగా చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలోని ప్రముఖ దర్శకులు, నిర్మాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చిరంజీవి బహిరంగ వేదిక ద్వారా..ట్విట్టర్ ద్వారా ఏపీ సీఎం జగన్ కు పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని రిక్వెస్ట్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ టిక్కెట్ల అమ్మకంలో పారదర్శకత లేదంటున్నారు..ఓకే..మీ మందు అమ్మకంలో పారదర్శకత ఉందా?. పారదర్శకత ఉంటే మీరు ఇన్నిసార్లు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాలు కూడా అన్నీ నగదు లావాదేవీల ద్వారానే జరుగుతున్నాయి కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతే కాదు..తన ఆర్ధికమూలాలను దెబ్బకొట్టేందుకే వైసీపీ సర్కారు సినిమా టిక్కెట్ల విషయంలో ఇలా చేస్తోందని మండిపడ్డారు. పంతానికి పోతే ఏపీలో తన సినిమాలు ఉచితంగా ఆడిస్తానని వ్యాఖ్యానించారు. అంతే కాదు..ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరం అంటూ వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఏపీ సర్కారు సినిమా టిక్కెట్ ధరల పెంపునకు అనుమతిస్తుందా?. అదనపు షోలు..బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది కొత్త సినిమాల నిర్మాతాలు..దర్శకుల టెన్షన్ గా మారింది. డిసెంబర్ 17 నుంచి పెద్ద సినిమాల జాతర ప్రారంభం కానుంది. తొలుత పుష్ప తొలి భాగం రానుంది. ఆ తర్వాత నాని సినిమా శ్యామ్ సింగరాయ్ ఉండగా, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, బీమ్లానాయక్, రాధేశ్యామ్, బంగార్రాజు వంటి సినిమాలు ఉన్నాయి. వీరంతా రాజకీయ వివాదాల జోలికి వెళ్ళకుండా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వస్తున్నారు.
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలను, సినిమాలను మిక్స్ చేసి చేసిన ప్రసంగం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ విమర్శలకు వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన దీక్షలో సినిమాల అంశాన్ని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే లేవదీశారని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఇది అందరి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అవుతుందని ఓ ప్రముఖుడు అభిప్రాయపడ్డారు. అయితే ఇది రాజకీయంగా ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది ఇప్పటికిప్పుడే చెప్పటం కష్టం అవుతుందనే అభిప్రాయం ఉంది. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తెరపైకి వచ్చిన వెంటనే ఏవేవో పిచ్చి మద్యం బ్రాండ్లపై అడ్డగోలు రేట్లు పెట్టి అమ్ముకుంటూ సినిమా టిక్కెట్ల ధరలనునియంత్రిస్తారా అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ సాగింది. అంతే కాదు...కొత్త మద్యం బ్రాండ్లతో పాటు వాటి రేట్లు కూడా భారీగా పెంచారు. ఇసుక, పెట్రోల్ పై వ్యాట్, ఆస్తి పన్ను ఇలా అన్ని రేట్లు పెంచి..సామాన్యులపై అన్నింటిపై భారం మోపి ఒక్క సినిమా టిక్కెట్ల విషయంలో మాత్రం ధరలు నియంత్రిస్తారా అంటూ జనసేన అభిమానులతోపాటు ఇతరులు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరింత మంట పుట్టించేలా ఉన్నాయి. మరి ఈ తరుణంలో ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..పవన్ కోణంలో పరిశ్రమ మొత్తం ప్రభావితం అయ్యేలా నిర్ణయం ఉంటుందా? లేక ఎక్కువ మంది ప్రయోజనాలు కాపాడేలా ముందుకు వస్తుందా అన్నది వేచిచూడాల్సిందే.