ఒక్క జీతం...నాలుగు పనులు
ఈనాడు ఉద్యోగులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా రిపోర్టర్లకు. వాళ్లు ఇప్పుడు ఒక్క జీతానికి నాలుగు పనులు చేయాల్సిన పరిస్థితి. దీంతో వాళ్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈనాడు రిపోర్టర్లకు ఇప్పుడు వీడియో రికార్డింగ్ కోసం ఓ ఫోన్ ..దానికి ఓ స్టాండ్ కూడా ఇచ్చారు. ఆ ఫోన్ లో రికార్డ్ చేయటం తప్ప...ఎవరి దగ్గర నుంచి ఫీడ్ తీసుకునే షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. అంటే విధిగా ఆ రిపోర్టర్ సమయానికి అక్కడ ఉండి రికార్డు చేసి తీరాల్సిందే. అయితే అందరికీ కాకుండా ఎంపిక చేసిన రిపోర్టర్లకు ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు ఇటీవల కాలంలో. ఈ బాధ్యతలు అప్పగించిన వారంతా ఈనాడు పత్రిక, ఈనాడు నెట్, ఈటీవీ భారత్, ఈటీవీకి ఫీడ్ ఇవ్వటంతోపాటు, వార్త పంపాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఇంక్రిమెంట్లు లేకపోగా ఇప్పుడు ఈ అదనపు బాధ్యతలు అప్పగించటంతో చాలా మంది రుసరుసలాడుతున్నారు. సహజంగా అధికారులు, మంత్రుల దగ్గర ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కంటే ప్రింట్ మీడియా ప్రతినిధులకు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. ఎందుకంటే వారు ఏమీ రికార్డు చేయరు కాబట్టి.
అన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడేవారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వస్తే వాళ్ళు ఏమైనా రికార్డింగ్ చేస్తున్నారా అనే అనుమానంతో చూసేవారు. అయితే ఇప్పుడు రిపోర్టర్లకే కెమెరా, మైక్ లు..స్టాండ్లు ఇచ్చి వాళ్ళనే అన్ని పనులు చేయమనం వల్ల చాలా మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇది తమకూ అధికారులకు మధ్య ఉన్న సంబంధాలను కూడా దెబ్బతీస్తుందని..ఇప్పుడు ఇక తమతో ఎవరూ మనసు విప్పి మాట్లాడలేరని..ఇది అంతిమంగా సంస్థకే నష్టం చేస్తుందని కొంత మంది వాపోతున్నారు. కరోనా పేరుతో జాతీయ, స్థానిక మీడియా సంస్థలు అన్నీ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించి నాలుగైదు ఫ్లాట్ ఫామ్స్ కు పనిచేయించుకుంటున్నాయి.