ఒక పీఆర్ సీ 'రెండు అభినందనలు'
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టైలే వేరు అన్నట్లు ఉంది ఈ వ్యవహారం. ఉద్యోగులకు ఏ మాత్రం నచ్చని పీఆర్ సీ ఇచ్చి కూడా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన 'రెండు సార్లు అభినందనలు' చెప్పించుకున్నారు. మొత్తం ఎపిసోడ్ లో సీఎం జగన్ ఉద్యోగ సంఘ నేతలను ఎప్పుడైనా కలిశారా అంటే అది కేవలం అభినందనల సమయంలో మాత్రమే. గతానికి భిన్నంగా సర్కారు అసలు అశుతోష్ మిశ్రా నివేదిక బహిర్గతం చేయకుండా అధికారులతో నియమించిన కమిటీతోనే అంతా తే్ల్చేసింది. ముందు అసలు కమిటీ రిపోర్టులో ఏముందో చూసుకుంటాం..ముందు మాకు కాపీలు ఇవ్వండి అన్నా ఇంత వరకూ అది జరిగింది లేదు. అంతే కాదు..ఐఆర్ 27 శాతం ఇచ్చి..ఫిట్ మెంట్ మాత్రం 23 శాతం ఫిక్స్ చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి..కరోనా కష్టాలు వంటి అంశాలను సర్కారు పదే పదే ఉద్యోగ సంఘ నేతల ముందు పెట్టడంతో ఫిట్ మెంట్ 23 శాతానికి ఓకే అన్నారు. అంతే కాదు జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అక్కడ సీన్ కట్ చేస్తే పీఆర్సీ జీవోలు వెల్లడయ్యాక అంతా తారుమారైంది. హెచ్ఆర్ ఏ ల్లో భారీ కోతలు. సీసీఏ రద్దుతోపాటు ఐఆర్ రికవరీ వంటి అంశాలు జీవోల్లో ప్రస్తావించారు. దీంతో ఉద్యోగులతోపాటు సంఘాల నేతలు అందరూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆ తర్వాతే సమ్మె నోటీసు ఇచ్చి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగా నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఈ తరుణంలో పలు దఫాలు మంత్రుల కమిటీతో సుదీర్ఘ చర్చలు సాగాయి. చివరకు శనివారం అర్ధరాత్రి కథ సుఖాంతం అయింది.
అయితే ఉద్యోగ సంఘం నేతలు అంగీకరించిన షరతులపై ప్రధానంగా టీచర్ల సంఘం మండిపడుతోంది. అదే సమయంలో పీఆర్సీ సాథన కోసం ఏర్పాటైన జెఏసీ నుంచి తప్పుకుంటున్నట్లు కీలక సంఘం ప్రకటించింది. ఉద్యోగ సంఘం నేతలపై ఉద్యోగులు మండిపడుతూ వాట్సప్ ల్లో మరీ అభ్యంతరకర పోస్టులు కూడా పెడుతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే సర్కారు ప్రతిపాదనలకు అంగీకరించామని చెబుతున్న ఉద్యోగ సంఘం నేతలు అంతంత మాత్రంగా ఇచ్చిన ప్రయోజనాలకు అన్ని సార్లు అభినందనలు చెప్పాలా అన్న చర్చ ఉద్యోగుల్లో సాగుతోంది. పీఆర్సీ స్టీరింగ్ కమిటీలోని నాయకుల తీరుపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జెఏసీ నేత కె వి కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.'లక్షలాదిమంది ఉద్యోగుల, ఉపాధ్యాయుల చలో విజయవాడ స్ఫూర్తిని సజీవసమాధి చేసి,సగటు ఉద్యోగులను, సోదర ఉద్యోగసంఘాలను నిలువునా ముంచిన ఆ నలుగురు చిరస్థాయిగా ఉద్యమ ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు.' అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ఇది కూడా ఉద్యోగ సంఘం నేతల్లో హాట్ టాపిక్ గా మారింది.