జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో కీలక పరిణామం
కార్యదర్శిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కొత్త కమిటీ
జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లోనూ ఫిర్యాదు
నరేంద్ర చౌదరి, హనుమంతరావుతో కుమ్మక్కు ఆరోపణలు
జూబ్లిహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుత కార్యదర్శి మురళీ ముకుంద్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ ప్రెసిడెంట్ బి. రవీంద్రనాథ్ తోపాటు కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పది సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని రిజిస్టార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ కు అందజేశారు. తాజాగా ఎన్నికైన 15 మంది సభ్యుల కమిటీలో 11 మంది అంతా ఒకవైపే ఉన్నారు. తెలంగాణ సహకార చట్టంలోని సెక్షన్ 34 ఏ లోని ఉప సెక్షన్ 2 ప్రకారం 15 మంది సభ్యుల కమిటీలోని 10 మంది సభ్యుల సంతకాలతో నోటీసు అందజేశారు. నూతన కమిటీ ఈ ఏడాది మార్చి 21న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించగా..కమిటీ ఏర్పాటు అయింది మార్చి 24న అని తెలిపారు. సాధ్యమైనంత తొందరగా సమావేశం ఏర్పాటు చేసి ఈ తీర్మానం ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రిజిస్టార్ ను కోరారు. ఇదిలా ఉంటే జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కార్యదర్శి మురళీ ముకుంద్ పై ప్రెసిడెంట్ రవీంద్రనాధ్ పోలీసు కేసు కూడా పెట్టారు. ఆగస్టు 25న ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కార్యదర్శి మురళీ ముకుంద్ చట్ట విరుద్ధ,అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజింగ్ కమిటీ ఆమోదం లేకుండా, ఎవరి అనుమతి లేకుండానే సిటీ సివిల్ కోర్టులో నమోదు అయిన కేసును ఉపసంహరంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారని..ఇది నేరపూరితంగా విశ్వాసాన్ని ఉల్లంఘించటమే అన్నారు. దీంతోపాటు చీటింగ్ కు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇదే కమిటీ తరపున ఎన్నికైన మురళీ ముకుంద్ గత కమిటీ అక్రమాల పోరాటం విషయంలో రివర్స్ గేర్ వేసి..గత కమిటీలో ప్రెసిడెంట్, కార్యదర్శులుగా ఉన్న నరేంద్రచౌదరి, హనుమంతరావుల వైపు చేరిపోయారని సభ్యులు ఆరోపిస్తున్నారు.
స్వయంగా మురళీ ముకుంద్ ఇచ్చిన ఫిర్యాదులోనూ గత కమిటీ హయాంలో కొన్ని ఫైళ్ళు మాయం అయ్యాయని పేర్కొంటూ వాటిపై పోరాటం చేయకుండా కనీసం నిండా ఐదు నెలలు కూడా పూర్తి కాని కొత్త కమిటీపై ఆరోపణలు..విమర్శలు చేయటం అంటే గత కమిటీతో కుమ్మక్కు అయినట్లు స్పష్టం అవుతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాలతో కార్యదర్శి మురళీ ముకుంద్ పూర్తిగా విశ్వసనీయ కోల్పోయారని..తన ప్రతిష్టను తానే దిగజార్చుకున్నారని ఓ మేనేజింగ్ కమిటీ సభ్యుడు వ్యాఖ్యానించారు. గత పదిహేను సంవత్సరాలుగా జరిగిన అక్రమాలు..వేల కోట్ల రూపాయల స్కామ్ లు వెలికితీయాలని కొత్త కమిటీ చూస్తుంటే..మురళీ ముకుంద్ మాత్రం నిబందనలకు విరుద్ధంగా ఎస్ ఎంఎస్ లు వాడారు..ఫోన్లు వాడారు వంటి అంశాలపై ఫిర్యాదు చేయటంతోనే ఆయన అసలు ఉద్దేశం ఏంటో తేలిపోతుందని..ఆయన ఎవరితో కుమ్మక్కు అయి వ్యవహరాలు నడిపిస్తున్నారో ఊహించటం కష్టం కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.