ఆచార్య నిర్మాత నిరంజన్ రెడ్డికి వైసీపీ రాజ్యసభ సీటు?!
మారిన పరిస్థితుల్లో వైసీపీ నేత విజయసాయిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ ఉంటుందా? అంటే డౌటే అంటున్నాయి వైసీపీ వర్గాలు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం పార్టీలో చేసిన మార్పుల్లోనూ విజయసాయిరెడ్డికి పెద్ద దెబ్బే పడింది. అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి ఏ మాత్రం ప్రాధాన్యతలేని అనుబంధ విభాగాల బాధ్యతలకు ఆయన్ను పరిమితం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ అసలు పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకున్నదేలేదని..అలాంటిది అనుబంధ విభాగాలకు ఏమి ప్రాధాన్యత ఉంటుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అటు ప్రభుత్వంలోనూ..ఇటు పార్టీలోనూ మార్పులు, చేర్పులు పూర్తి కావటంతో త్వరలో భర్తీ చేయాల్సిన రాజ్యసభ సీట్లపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. తాజాగా కొత్త పేరు ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ అడ్వకేట్, ఆచార్య సినిమా నిర్మాతగా ఉన్న నిరంజన్ రెడ్డికి వైసీపీ తరపున రాజ్యసభ సీటు దక్కొచ్చని ఆ పార్టీ వర్గాల్లో బలంగా విన్పిస్తోంది.
జూన్ లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్నాయి. అందులో ఒకటి నిరంజన్ రెడ్డికి, మరొకటి బీద మస్తాన్ రావుకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. నాలుగు సీట్లలో ఒక సీటును ఢిల్లీ కోటా కింద కేటాయిస్తారని కూడా బలంగా ప్రచారంలో ఉంది. నాల్గవ సీటును ఎస్సీకి కేటాయిస్తారా? లేక మైనారిటీకా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నా ఈ సారి ఆయనకు ఛాన్స్ లేనట్లేఅంటున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అత్యంత కీలకమైన వైజాగ్, అనకాపల్లి జిల్లాల ప్రాంతీయ సమన్వయ బాధ్యతలు అప్పగించినందున ఈ టర్మ్ లో ఆయన పేరు కూడా పరిశీలనకు రాకపోవచ్చన్నది పార్టీ వర్గాల అంచనా.