Telugu Gateway
Telugugateway Exclusives

మంత్రులు మార‌తారు..కానీ ఆ టీటీడీ స‌భ్యులు మాత్రం మార‌రా?

మంత్రులు మార‌తారు..కానీ ఆ టీటీడీ స‌భ్యులు మాత్రం మార‌రా?
X

జూప‌ల్లి, శ్రీనివాస‌న్, పార్ధ‌సార‌ధి రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డిల‌కు మ‌ళ్ళీ ఛాన్స్

ఏపీలో మంత్రివ‌ర్గానికి సంబంధించి జ‌గ‌న్ తొలి రోజుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా తెర‌పైకి తెచ్చారు. రెండున్న‌ర సంవ‌త్స‌రాలు కొంత మంది. మిగిలిన రెండున్న‌ర సంవ‌త్స‌రాలు మ‌రికొంత మందికి ఛాన్స్ మంత్రి ప‌ద‌వులు అన్నారు. ముందుగానే ఇలా ప్ర‌క‌టించిన వ్య‌క్తి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డే. అత్యంత కీల‌క‌మైన కేబినెట్ లో మార్పులు ఉంటాయి కానీ..టీటీడీ బోర్డులో మాత్రం వారికి సీఎం జ‌గ‌న్ 'ప్ర‌త్యేక హోదా' క‌ల్పించిన‌ట్లు క‌న్పిస్తోంది. బోర్డు ఎప్పుడు వేసిన వారి పేర్లు కామ‌న్ అన్న‌ట్లు ఉంది వ్య‌వ‌హ‌రం. ఏకంగా మంత్రివ‌ర్గంలోనే మార్పులు చేస్తాన‌న్న సీఎం జ‌గ‌న్ టీటీడీ బోర్డులో మాత్రం త‌న‌కు కావాల్సిన స‌న్నిహితులు..పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రెండ‌వ‌ సారి కూడా ఛాన్స్ ఇవ్వ‌టం చ‌ర్చ‌నీయాంశం అయింది. మై హోం అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఇప్పుడు పారిశ్రామిక‌వేత్త‌గానే కాకుండా...టీవీ9 ఛాన‌ల్ ఓన‌ర్ కూడా అయ్యారు. దీంతో ఆయ‌న‌కు మ‌ళ్ళీ టీటీడీ బోర్డులో చోటు ద‌క్కింది. ఇక ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, పార్ధ‌సార‌ధిరెడ్డిలు జ‌గ‌న్ సొంత మ‌నుషుల కిందే లెక్క‌. వేమిరెడ్డి ప్ర‌శాంత్ రెడ్డి అయితే వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి భార్య‌. తెలంగాణ ప్రాంతం నుంచి మురంశెట్టి రాములు, ల‌క్ష్మీనారాయ‌ణ‌ల‌కు కూడా రెండ‌వ సారి ఛాన్స్ ద‌క్కింది.

ఎంతో ప్రాధాన్య‌త ఉండే టీటీడీ బోర్డులో ఒక‌సారి చోటు ద‌క్క‌ట‌మే ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. అలాంటిది సీఎం జ‌గ‌న్ మాత్రం అస్మ‌దీయుల‌కు ఏకంగా రెండ‌వ సారి కూడా ఛాన్స్ ఇవ్వ‌టం అటు వైసీపీ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చంద్ర‌బాబు హ‌యాంలో టీటీడీ బోర్డులో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు చోటు క‌ల్పిస్తున్నార‌ర‌ని విమ‌ర్శించిన వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌ అంత కంటే రెట్టింపు మేర‌ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, సీఎం స‌న్నిహితుల‌కు మాత్ర‌మే చోటు క‌ల్పిస్తూ నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అంతేకాదు..కేవ‌లం ద‌ర్శ‌నాల కోస‌మే అంటూ 50 మందిని ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మించ‌టంపై కూడా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ ఇంత భారీ స్థాయిలో ప్ర‌త్యేక ఆహ్వానితులు లేరు. ఈ బోర్డును చూసిన అధికారులు కూడా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మాట్లాడేది ఒక‌టి..అధికారంలోకి వ‌చ్చాక చేసేది మ‌రొక‌టి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it