తెలంగాణలో 'అసలు ఆట మొదలైంది'
సీఎం కెసీఆర్ సొంత జిల్లాలో ఉప ఎన్నికలో ఓటమి
తెలంగాణ అంటే టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే తెలంగాణ.ఇప్పటివరకూ ఇదే సాగింది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. కొత్త ఆట మొదలవుతోంది. ముఖ్యమంత్రి కెసీఆర్ సొంత జిల్లాలోని దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందునా గత ఎన్నికల్లో ఏకంగా 62 వేల మెజారిటీతో గెలిచిన సీటు. దీంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించటంతో జరుగుతున్న ఎన్నిక. సానుభూతి సహజం. అందునా జిల్లాలో అత్యంత శక్తివంతమైన నేత హరీష్ రావు పూర్తిగా ప్రచార బాధ్యతలు చేపట్టారు. టీఆర్ఎస్ ఇంత కాలం ఎంతో బలంగా ఉన్న నియోజకవర్గం. అందులో అధికార పార్టీ. ఇన్ని సానుకూలతలు ఉన్నా కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ మెజారిటీని పెంచుకోవాల్సింది పోయి ఏకంగా ఓటమి పాలు అవటం..అందుకు కారణం బిజెపి కావటం ఖచ్చితంగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలకు ఇది స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు.
ఎలాగైనా బిజెపి తెలంగాణలో పాగా వేయాలని గత కొన్ని రోజులుగా దూకుడు పెంచింది. రెండవసారి గెలిచిన తర్వాత కూడా తొలి ఏడాది వరకూ సీఎం కెసీఆర్ పెద్దగా కేంద్రంపై, బిజెపిపై విమర్శలు చేయలేదు. కానీ గత కొన్ని రోజులుగా సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ లు ఎన్నడూలేని రీతిలో ఇప్పుడు బిజెపిపై విమర్శల దాడి పెంచారు. బిజెపి రాజకీయ టార్గెట్ గ్రహించిన కెసీఆర్ కాంగ్రెస్ కంటే బిజెపిపై,కేంద్రంపై తీవ్ర విమర్శలు ప్రారంభించారు. తాజాగా కూడా మంత్రి కెటీఆర్ దుబ్బాకలో బిజెపి, కాంగ్రెస్ లకు డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. కానీ పలితం చూస్తే సీన్ రివర్స్ అయింది. డిపాజిట్లు రావన్న బిజెపి దుబ్బాక సీటుపై జయకేతనం ఎగరేయగా, టీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోవాల్సి వచ్చింది.
దుబ్బాక గెలుపు ఊపుతో బిజెపి తెలంగాణలో మరింత దూకుడు పెంచనుంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ సమయంలో ఓ ఉప ఎన్నికలో అధికార పార్టీ పెద్దగా ఉనికే లేని బిజెపి చేతిలో ఓటమి పాలు అవటం అన్నది రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగానే భావించాలి. గట్టిగా రంగంలోకి దిగితే టీఆర్ఎస్ ను ఓడించటం పెద్ద కష్టం కాదని ..అది కూడా సీఎం సొంత జిల్లాలో చూపించటం అనేది బిజెపికి కొత్త ఉత్సహన్ని ఇచ్చేదే. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటం కూడా ఓ సానుకూల అంశం. అయినా సరే టీఆర్ఎస్ దుబ్బాకలో బిజెపి అభ్యర్ధి రఘనందన్ రావుకి అధికార టీఆర్ఎస్ చుక్కలు చూపించింది. అయినా సరే రఘునందన్ రావు విజయం సాధించటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.