Telugu Gateway
Telugugateway Exclusives

వైసీపీ ప్ర‌చారం చేసినా లోకేష్ ను సీఎంగా ఏపీ ప్ర‌జ‌లు ఒప్పుకోరా?!

వైసీపీ ప్ర‌చారం చేసినా లోకేష్ ను సీఎంగా ఏపీ ప్ర‌జ‌లు  ఒప్పుకోరా?!
X

లోకేష్ ప‌రువు తీసిన ఆ ప‌త్రిక‌!

చంద్రబాబు సీఎంగా ఉండ‌టానికి లోకేష్ ఎండార్స్ మెంట్ అవ‌స‌ర‌మా?

పాయె. అంతా అయిపాయె. ఆ ప‌త్రిక టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప‌రువు సాంతం తీసేసింది. అధికార వైసీపీ పీకె టీమ్ తో ఒప్పందం చేసుకుని రాష్ట్రమంతా తిరిగి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే లోకేష్ సీఎం అవుతార‌ని ప్ర‌చారం చేస్తే అది పార్టీకి న‌ష్టం చేస్తుంద‌ని తేల్చేసింది. పోటీ జ‌గ‌న్ వ‌ర్సెస్ చంద్ర‌బాబు అయితేనే ఫ‌లితం ఉంటుంది త‌ప్ప‌..లోకేష్ వ‌ర్సెస్ జ‌గ‌న్ అయితే ప‌నికాద‌ని సూత్రీక‌రించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే నారా లోకేష్ సీఎం అవుతార‌ని..లోకేష్ అంటే జ‌గ‌న్ బెట‌ర్ అనే సూత్రీక‌ర‌ణ చేయటం ద్వారా ఓట‌ర్ల‌ను జ‌గ‌న్ వైపు ప్రభావితం చేస్తార‌ట‌. ఏపీలో జ‌గ‌న్ పై అన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని..దీన్ని టీడీపీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిస్తే చంద్ర‌బాబే సీఎంగా ఉంటార‌నే సంకేతాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. అంతే కాదు..మ‌రింత విచిత్రంగా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోనే త‌మ పార్టీ ఎన్నిక‌ల‌కు వెళుతుంద‌ని..అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ చంద్రబాబే సీఎం అవుతార‌ని స్వ‌యంగా లోకేష్ స్వ‌యంగా చెబుతున్నార‌ని ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం. అంటే చంద్ర‌బాబు సీఎం కావ‌టానికి లోకేష్ ఎండార్స్ మెంట్ అవ‌సరం అవుతుందా?. పార్టీలో ఎప్ప‌టి నుంచో లోకేష్ కు కీల‌క నేత‌ల ద‌గ్గ‌ర నుంచి ఆమోదం ల‌బించ‌టం లేద‌నే అభిప్రాయం ఉంది.

అంతే కాదు..స్వ‌యంగా బుచ్చ‌య్య చౌద‌రి వంటి సీనియ‌ర్ నేత కూడా చంద్ర‌బాబు ఎత్త‌క‌పోతే పోయారు క‌నీసం లోకేష్ కూడా త‌మ లాంటి సీనియ‌ర్ల ఫోన్ల‌కు స్పందించ‌ర‌ని..తాము పార్టీకి సంబంధించిన అంశాలు ఎవ‌రితో చ‌ర్చించాల‌ని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. పైకి ఎంత చెబుతున్నా పార్టీలో నియంత్ర‌ణ అంతా ప్ర‌స్తుతం లోకేష్ చేతుల్లోకి వెళ్లింద‌నే విష‌యం నేత‌లు అంద‌రికీ తెలుసు. ముఖ్యంగా ఆర్ధిక వ్య‌వ‌హారాల్లో పార్టీ అధినేత చంద్ర‌బాబు పాత్ర‌ను బాగా ప‌రిమితం చేశార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే చాలా మంది నేత‌లు చురుగ్గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో వ్య‌వ‌హ‌రించాలంటే సీటుతోపాటు ప‌లు అంశాల‌పై స్ప‌ష్ట‌త కోరుకుంటున్నారు. ఆ స్ప‌ష్ట‌త ఉన్న వారే ప్ర‌స్తుతం రంగంలోకి దిగి కాస్త చురుగ్గా ఉంటున్నారు. మిగిలిన వారు మాత్రం స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చూసుకుందాములే అని వేచిచూస్తున్నారు. వైసీపీ వ్యూహం అంటూ ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో గురువారం నాడు ప్ర‌చురితం అయిన క‌థ‌నం వైసీపీకి ఎంత న‌ష్టం చేస్తుందో తెలియ‌దు కానీ...అటు టీడీపీకి. ఇటు నారా లోకేష్ కు మాత్రం ఫుల్ డ్యామేజ్ చేయ‌టం ఖాయం అని ఓ టీడీపీ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it