Telugu Gateway
Telugugateway Exclusives

పాదయాత్ర తో పవర్..మరోసారి ప్రూవ్ అవుతుందా?!

పాదయాత్ర తో పవర్..మరోసారి ప్రూవ్ అవుతుందా?!
X

నాయకుడు ప్రజల్లో ఉండటం మంచిదే. నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల నాయకుడి గురించి ప్రజలకు...ప్రజా సమస్యల గురించి నాయకుడికి ఒక అవగాహన వస్తుంది. అధికారంలోకి రావటానికి నాయకులకు ఇప్పుడు పాదయాత్రలు ఒక దగ్గరి దారిగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇప్పటికే పలు మార్లు నిరూపితం అయింది కూడా. దివంగత రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత చంద్రబాబు, జగన్ లు కూడా ఇదే మోడల్ ఫాలో అయ్యారు . విజయం సాధించారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇప్పుడు జనవరి 27 నుంచి యువగళం పేరుతో 400 రోజులు...4000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ ఈ యాత్రకు అనుమతి విషయంలో వ్యవహరిస్తున్న తీరు లోకేష్ పాదయాత్రకు హైప్ తేవటానికి బాగానే పనికొస్తోంది. టీడీపీ లో యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేత కూడా నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయం అని ఇటీవలే ప్రకటించారు. అంటే టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అది నారా లోకేష్ పాదయాత్ర వల్ల తప్ప చంద్రబాబు పాత్ర ఏమి లేదు..ఉండదు అని యనమల చెప్పదల్చుకున్నారా అన్న చర్చకు అయన తెరతీశారు. ఇది ఒక అంశం అయితే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, జనసేన కలిసి ముందుకు సాగటానికి నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కా అన్న ధీమా రెండు పార్టీల నేతల్లో ఉంది.

ఇటీవల హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును అయన నివాసంలో కలవగానే అధికార వైసీపీ మంత్రులు..నేతలు స్పందించిన తీరు చూస్తే ఈ కలయికపై వాళ్ళు ఎంతగా బయపడ్డారో స్పష్టంగా అర్ధం అవుతుంది. మరి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాఫిగా సాగి కలిసి పోటీ చేసి విజయం సాధిస్తే ఆ గెలుపులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ క్రెడిట్ ఇస్తుందా..లేక కేవలం నారా లోకేష్ పాదయాత్ర వల్లే ఇది సాధ్యం అయింది అని చెపుతుందా? . మరో కీలక అంశం ఏమిటి అంటే సీఎం జగన్ పాలనకు సంబంధించి పలు అంశాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయినా సరే జగన్ మాత్రం తన బటన్ నొక్కుడు పథకాలే తనను బయటపడేస్తాయనే ధీమాతో ఉన్నారు. కారణాలు ఏమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలు అయితే అది జగన్ పాలనపై వ్యతిరేకతతోనే తప్ప మరొకటి కాదనే అభిప్రాయం కూడా పలువురు నేతల్లో ఉంది. ఇన్ని సంక్లిష్టతల మధ్య నారా లోకేష్ పాదయాత్ర ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా పూర్తి చేయటం ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. అదే సమయంలో ఇప్పటికే కొంత మంది టీడీపీ శ్రేణులు అటు సోషల్ మీడియా తో పాటు బయట కూడా నారా లోకేష్ కు కేజీఎఫ్ 2 సినిమాలో హీరో యశ్ కు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన తరహాలో ఎలివేషన్స్ ఇస్తున్నారు. చూడటానికి...అభిమానులకు బాగానే ఉండొచ్చు ఎక్కడైనా లెక్క తేడా వస్తే మొదటికే మోసం రావటం ఖాయం అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో ఉంది. మరి నారా లోకేష్ తన పాదయాత్రతో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారో తెలియాలి అంటే ఇంకా చాలా సమయమే ఉంది.ఇందులో ఎక్కడ లెక్క తేడా వచ్చినా అది నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపించటం ఖాయం అనే చర్చ కూడా సాగుతోంది.

Next Story
Share it