Telugu Gateway
Telugugateway Exclusives

నంద్యాల...హుజూరాబాద్... ఉప ఎన్నికల్లో ఎంత తేడా?!

నంద్యాల...హుజూరాబాద్... ఉప ఎన్నికల్లో ఎంత  తేడా?!
X

అక్కడ పనిచేసిన అధికారం..డబ్బులు ఇక్కడ పనిచేయలేదు

రాజకీయాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. డబ్బు ఖర్చుతోపాటు పలు విషయాల్లో తెలంగాణ, ఏపీల మధ్య ఈ తేడా కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ఏపీలో 2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక అంశాన్ని ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. సరిగ్గా ఏపీలో కూడా సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందు అంటే 2017 ఆగస్టులో అక్కడ నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగింది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. అప్పటి అధికార టీడీపీ తన అభ్యర్ధిగా భూమా బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపింది. వైసీపీ శిల్పా మోహన్ రెడ్డిని పోటీలో నిలబెట్టింది. అప్పటికే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీపై వ్యతిరేకత పీక్ కు వెళ్లింది. అసలు అక్కడ టీడీపీ గెలుస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే అధికార టీడీపీ భారీ ఎత్తున డబ్బు వెదజల్లటంతోపాటు నియోజకవర్గంపై హామీల వర్షం కురిపించింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది కాలం ముందు ఉప ఎన్నికలో ఓడిపోతే ఆ ప్రభావం పార్టీపై ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు భూమ్యాకాశాలను ఏకం చేసి తన అభ్యర్ధిని గెలిపించుకున్నారు.

అక్క‌డ సీన్ క‌ట్ చేస్తే ఏపీలో పనిచేసిన డబ్బు, అధికార వ్యవహరం తెలంగాణలో పనిచేయలేదనే చెప్పాలి. ప్ర‌జ‌ల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు తెలంగాణలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం ఉండదనటానికి హుజూరాబాద్ ఉప ఎన్నికే నిదర్శనం. నంద్యాల-హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పట్లో అక్కడి అధికార టీడీపీ ఏమి ప్రచారం చేసిందో..ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ కూడా అలాంటి ప్రచారమే చేసింది. తామే ఇంకా రెండేళ్లు అధికారంలో ఉంటామని..ఈటెల రాజేందర్ గెలిచి కొత్తగా చేసేది ఏమి ఉంటుందని ప్రచారం నిర్వహించారు. అయినా సరే ఏపీలో వచ్చిన ఫలితం మాత్రం తెలంగాణలో రాలేదు. ఎంత డబ్బు పంపిణీ జరిగినా..అధికార పార్టీ ఎన్ని వరాలు కురిపించినా ప్రభుత్వ వ్యతిరేకత ముందు ఇవేమీ నిలబడలేదు. తెలంగాణ ఓటర్లు ఇంత ఒత్తిడిలోనూ, హామీల వ‌ర్షంలో త‌డిసి కూడా ప్రభుత్వ వ్యతిరేక తీర్పు వెలువరించటం విశేషం.

Next Story
Share it