డ్రగ్స్ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేసిన ఆ వైసీపీ ఎంపీ ఎవరు?!
విజయవాడ అడ్రస్. ముంద్రా పోర్టు. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ముంద్రా పోర్టు డ్రగ్స్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఇరికించారనే ఆరోపణలూ తెరపైకి వచ్చాయి. ఇది అంతా ఒకెత్తు అయితే ఏపీకి చెందిన ఓ అదికార పార్టీ ఎంపీ ఒకరు ఈడీకి రెండుసార్లు ఆకాశరామన్న ఉత్తరాలు రాయించారని. వాటిపై ఈడీ స్పందించకపోయే సరికి స్వయంగా ఆయనే రంగంలోకి ఫిర్యాదు చేశారనే వార్త ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. కీలక నేతకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిపై ఈ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు వ్యవహారం ఈడీ ద్వారా చేరాల్సిన వారికి చేరటంతో ఇది ఇప్పుడు ఢిల్లీ సర్కిళ్ళలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు..ఏ ఇద్దరు వైసీపీ ఎంపీలు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. విజయవాడ అడ్రస్ కేంద్రంగా ఉన్న కంపెనీ పేరు మీద వేల కిలోల హెరాయిన్ రావటంతో దీనిపై ఏపీలోరాజకీయ దుమారం కూడా రేగిన విషయం తెలిసిందే. దీని విలువ 21 వేల కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి.
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కేవలం విజయవాడ అడ్రస్ మాత్రమే వాడుకున్నారని..విజయవాడకు, డ్రగ్స్ కు సంబంధంలేదని ఏపీ డీజీపీతో సహా ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార వైసీపీ, పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అడ్రస్ మాత్రమే కాదు..లావాదేవీలకు సంబంధించి ఆ సంస్థ జీఎస్టీ కూడా ఇక్కడే కట్టారని,వీటి సంగతి ఏంటి విమర్శించారు. కేంద్రం ఈ కేసు ఎన్ ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో ఓ అధికార పార్టీ ఎంపీ ఇదే అంశంపై ఈడీకి ఫిర్యాదు చేయటం కలకలం రేపుతోంది. అసలు ఆయన ఈ పని ఎందుకు చేశారు?. ఎవరిని బుక్ చేసేందుకు ఇంత సాహసం చేశారు. మరి విషయం చేరాల్సిన వారికి చేరటంతో ఆయన భవిష్యత్ ఎలా ఉండబోతుంది? అన్న అంశం పార్ట వర్గాల్లో...ఢిల్లీ సర్కిళ్ళలో ఉత్కంఠ రేపుతోంది.