మూడ్ ఆఫ్ ద తెలంగాణ...సర్వే పనిలో కాంగ్రెస్
తెలంగాణ ప్రజల మూడ్ ఎలా ఉంది?. ముఖ్యమంత్రి కెసీఆర్ పై వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉంది. దళిత బంధు అమలు సాధ్యం అవుతుందా?. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఇది అటకెక్కుతుందా?. అసలు దీనిపై ప్రజలు ఏమి అనుకుంటున్నారు?. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన దండోరా సభలు కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చుతాయా?. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల్లో స్పందన ఎలా ఉంది వంటి అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో వచ్చే ఫలితాలను బట్టి భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేసుకోనున్నారు. గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల వరకూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో జోష్ పెరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వరస పెట్టి దళిత, గిరిజన దండోరా సభలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లిలో ప్రారంభించిన ఈ సభలు సెప్టెంబర్ 17 వరకూ కొనసాగనున్న విషయం తెలిసిందే. మధ్యలో ఓ సభకు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్, ఎంపీ రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.
వాస్తవానికి దళిత బంధుకు కౌంటర్ గానే కాంగ్రెస్ పార్టీ ఈ సభలను తెరపైకి తెచ్చినట్లు కన్పిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దళిత, గిరిజన వర్గాలు సాలిడ్ ఓటు బ్యాంకుగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే తమ సంప్రదాయ ఓటుకు బ్యాంకును కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ పాత హామీలు అయిన దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి వంటి అంశాలను ఆయా వర్గాలకు గుర్తు చేయటం ద్వారా ఆయా వర్గాలు తమ చేజారి పోకుండా చూసుకోవాలనే ఆలోచనలో ఉంది. ప్రాధమిక అంచాల ప్రకారం అయితే ఏ మాత్రం ఆశలు లేని స్థితి నుంచి గిరిగీసి బరిలో నిలబడే పరిస్థితి మాత్రం వచ్చిందనే సంకేతాలు కూడా అందుతున్నాయి. అదే సమయంలో పార్టీ అధిష్టానం కూడా దళిత, గిరిజన దండోరా సభలపై హ్యాపీ గా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దళిత, గిరిజన దండోరా సభలు పూర్తయిన తర్వాత కరోనా మూడవ దశ ప్రభావం పెద్దగా లేకపోతే రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతితో పాదయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని సమాచారం.