జగన్ ను 'ఫిక్స్' చేసిన మోహన్ బాబు!
సీఎంను సినీ పరిశ్రమ వాళ్లు కలవనందుకే ఈ తిప్పలు అనేలా లేఖ
ముఖ్యమంత్రిని కలవాలని రెండున్నర సంవత్సరాల తర్వాత మోహన్ బాబు వ్యాఖ్యలు
'ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రులను ముందుగా మనం కలవాలి. వాళ్లను మనం గౌరవించుకోవాలి. మన కష్టసుఖాలు చెప్పుకోవాలి. అలా జరిగిందా. జరగలేదు.' ఇవీ ఆదివారం రాత్రి సీనియర్ నటుడు మోహన్ బాబు విడుదల చేసిన లేఖలోని అంశాలు కొన్ని. సినీ పరిశ్రమ ముఖ్యమంత్రిని కలసి తమ సమస్యలు చెప్పి పరిష్కరించమని కోరటంలో తప్పేమీ ఉండదు. ప్రతి రాష్ట్రంలో ఇది సహజంగా జరిగే పనే. అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత మోహన్ బాబు బయటకు వచ్చి అందరూ కలసి ముఖ్యమంత్రిని..కలవాలి..అడగాలి..గౌరవించుకోవాలి అనటంతో అసలు విషయం ఏమిటా అన్న చర్చ ప్రారంభం అయింది. ఓ నలుగురైదుగురు మినహా ఎప్పటి నుంచో పరిశ్రమ అంతా టీడీపీ చేతుల్లో ఉందనే ఉద్దేశంతోనే జగన్ ఇలా చేస్తున్నారనే అభిప్రాయాలను కల్పించేలా మోహన్ బాబు లేఖ ఉంది. గెలిచిన తర్వాత సీఎం జగన్ ను టాలీవుడ్ పరిశ్రమలోని వారు ఎవరూ కలవలేదని..గౌరవించలేదని అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనే తీరుగా అందులోని అంశాలు ఉన్నాయి.
నిజంగా మోహన్ బాబు పెదరాయుడు పాత్ర తీసుకుని..జగన్ సీఎం అయిన వెంటనే పరిశ్రమలో ఆయన చెప్పినట్లే అందరితో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిని కలుద్దామని చెప్పి ఉండొచ్చు కదా. కానీ ఆయన కూడా ఆ పని చేయలేదు. ఇప్పుడు సినిమా టిక్కెట్ల అంశం పెద్ద వివాదంగా మారిన తరుణంలో చాలా కూల్ గా బయటకు వచ్చిన మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేయటం ద్వారా సీఎం అయిన వెంటనే పరిశ్రమ ప్రముఖులు ఎవరూ తనను కలవలేదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ తిప్పలు అనే అర్ధం వచ్చేలా చేసి ఇప్పటికే ఈ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీని మరింత ఇరకాటంలోకి పెట్టేశారనే చెప్పొచ్చు. అయితే వీటి అన్నింటిని వైసీపీ పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్లు కన్పించటం లేదు. పైగా మోహన్ బాబు అధికారికంగా వైసీపీలో చేరారు. అంతే కాదు..ఆయనకు జగన్ తో బంధుత్వం కూడా ఉంది. అయినా ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎప్పుడూ పరిశ్రమ అంశంపై మోహన్ బాబు మాట్లాడింది లేదు. సీఎం జగన్ స్వయంగా పేదలకు వినోదాన్ని తక్కువ ధరకే అందించేందుకు సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించామని ప్రకటించారు. దీన్ని వ్యతిరేకించే వారంతా పేదల వ్యతిరేకులే అన్నారు. అయినా మోహన్ బాబు ఈ సమస్యపై మాత్రం నోరెత్తటం లేదు.
జగన్ సీఎం అయిన చాలా రోజుల తర్వాత చిరంజీవి, నాగార్జున, మరికొంత మంది దర్శకులు జగన్ ను వెళ్లి కలిసొచ్చారు. అప్పుడు మాత్రం పరిశ్రమ అంతా ఏపీకి తరలిరావాలని..పరిశ్రమ కు అవసరమైన భూ కేటాయింపులు చేయటంతో ఏపీకి వచ్చే నటీ, నటుల నివాసాలకు కూడా స్థలాలు కేటాయిస్తామని ఆ సమావేశం ముగిశాక మంత్రి పేర్ని నాని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏపీ సర్కారు వర్సెస్ టాలీవుడ్ అన్న చందంగా తయారైంది. మెగాస్టార్ చిరంజీవి పెద్దరికం పాత్ర నుంచి మిడిల్ డ్రాప్ అయ్యారు. మరి మోహన్ బాబు ఆయన చెప్పినట్లే అందరితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తారో లేక...అలా వదిలేస్తారో చూడాలి. కానీ తెలంగాణలో మాత్రం పరిశ్రమ కోరుకున్నట్లు సినిమా టిక్కెట్ రేట్లు పెంచి హైదరాబాద్ నుంచి పక్కచూపులు చూడాల్సిన అవసరం లేకుండా చూసుకుంటున్నారు కెసీఆర్. ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళాలంటే అందుకు ప్రత్యేక ఆకర్షణలు ఉండాలి. ఆకర్షణలు లేకపోగా ఏపీ సర్కారు పరిశ్రమను మరింత చిక్కుల్లో పెట్టేలా సినిమా టిక్కెట్ ధరలు నిర్ణయించి అందరినీ సమస్యల్లోకి నెట్టింది. ఈ తరుణంలో, ఈ తీరుతో ప్రభుత్వం వ్యవహరిస్తుంటే అసలు టాలీవుడ్ ఏపీ వైపు కన్నెత్తి అయినా చూస్తుందా?. అసలు ఆ ఛాన్సే లేదు.