ఎప్పుడూ వెనక్కి తగ్గని మోడీ ఇప్పుడెందుకు తగ్గారు?
ఏడేళ్లలో మోడీ తొలి వెనకడుగు ఇదే...!
ఆత్మరక్షణలో మోడీ సర్కారు!
వ్యాక్సినేషన్ పై మోడీ రివర్స్ గేర్
దేశానికి వెన్నెముఖ అని ఘనంగా చెప్పే రైతుచట్టాల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా మోడీ సర్కారు డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతోంది. ఏడేళ్ల పాలనలో తొలిసారి మోడీ వెనకడుగు వేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాము చేసేదే కరక్ట్ అంటూ వాదించే బిజెపి నేతలు ఇప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం అంతిమంగా ప్రజలకు మేలు చేసేది కాబట్టి మంచిదే. అయితే ఎప్పుడూ తగ్గని మోడీ ఇప్పుడు ఎందుకు తగ్గాడు. ఇది కూడా చూడాల్సిన అంశమే మరి. విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం ఎందుకు? అంటూ సుప్రీంకోర్టును ప్రశ్నించిన కేంద్రం సడన్ గా రివర్స్ గేర్ వేసింది. బడ్జెట్ లో వ్యాక్సిన్ కోసం కేటాయించిన 35 వేల కోట్లు ఎక్కడో లెక్క చెప్పండి.అసలు ఇప్పటివరకు ఎన్ని వ్యాక్సిన్లు కొన్నారు..ఎంత చెల్లించారు ఈ లెక్కలు మొత్తం కోర్టు ముందు ఉంచండి అంటూ సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో మోడీ సర్కారు గొంతులో పచ్చివెలక్కాయపడినట్లు అయింది పరిస్థితి. దీంతో సోమవారం ఐదు గంటలకు దేశ ప్రజల ముందుకు వచ్చిన మోడీ ఎవరూ ఊహించని నిర్ణయాన్ని ప్రకటించారు. పలు రాష్ట్రాల విమర్శలు... కొనుగోలు చేద్దామన్నా అందుబాటులో లేని వ్యాక్సిన్లు. కేంద్రమే కొనుగోలు చేసి అందరికీ సరఫరా చేస్తుంది అని వెల్లడించారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేంద్రమే వ్యాక్సిన్ సేకరించే విధానాన్ని పరిశీలించవచ్చని ప్రకటించారు సోమవారం నాడే. అయితే అందుకు భిన్నంగా మోడీ ఉచిత వ్యాక్సిన్ ప్రకటించి..రాష్ట్రాలు దీని కోసం రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదని అన్నారు.
వాస్తవానికి కేంద్రమే వ్యాక్సినేషన్ వ్యయం భరించాలని పలు పార్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఎప్పుడూ దీనికి సానుకూలంగా స్పందించని మోడీ సర్కారు తాజాగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలతోనే దారికొచ్చినట్లు కన్పిస్తోంది. ఇంత కాలం వ్యాక్సినేషన్ విషయంలో నానా గందరగోళం చేసి తీరా ఇప్పుడు కేంద్రం రివర్స్ గేర్ వేయటంతో మోడీ సర్కారు ఈ విషయంలో ఆత్మరక్షణలో పడినట్లు అయింది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే వస్తువుకు మూడు ధరలు ఉండవు. కానీ ప్రజల ప్రాణాలను నిలబెట్టే వ్యాక్సిన్ల విషయంలోనే కేంద్రం అండతో ప్రైవేట్ కంపెనీలు మాత్రం అలా డిసైడ్ చేశాయి. కేంద్రానికి ఓ ధర..రాష్ట్రానికి ఓ ధర..ప్రైవేట్ ఆస్పత్రులకు ఓ ధర. బహుశా ఈ వింత భారత్ లో ఒక్కచోట జరిగి ఉంటుంది. వ్యాక్సిన్ కంపెనీలకు ఇలా అవకాశం ఇచ్చింది కేంద్రమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కేంద్ర ఆమోదం లేకుండా కంపెనీలు ఆ పని చేయలేవు. నిజంగా కేంద్రం వ్యాక్సినేషన్ కు కు నిధులు భరించలేని పరిస్థితిలో ఉంటే...ఓ నియంత్రణా కమిటీ వేసి..కంపెనీలకు లాభాలు వచ్చేలా ఓ ధరను ఖరారు చేసి ఉండేది. కానీ ఆ పని చేయలేదు. మిగిలిన మందులు..డ్రగ్స్ విషయంలో ఎలాగూ ఆ పని చేయటం లేదు. కానీ కరోనా వ్యాక్సిన్ అనేది దేశంలో ప్రతి ఒక్క మనిషికి ఇవ్వాల్సింది కాబట్టి దీనికి కమిటీ..ధర నిర్ధారణ అవసరం. కానీ ఆ పని చేయలేదు. అయితే కాస్త ఆలశ్యంగా అయినా మోడీ సర్కారు దేశంలో వ్యాక్సిన్ గందరగోళానికి తెరదించే నిర్ణయం తీసుకోవటంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.