ఏపీలో పది మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు 'మెఘా'ర్పణం
పదహారు కాలేజీల్లో పది మెఘా కే
మొత్తం ప్రాజెక్టు వ్యయం 7880 కోట్లు...మెఘా వాటా పనులు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు
అది సాగునీటి ప్రాజెక్టు అయినా మెఘానే. విద్యుత్ ప్రాజెక్టు అయినా మెఘానే. ఇప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా మెఘాకే. ఒకప్పుడు చంద్రబాబు బినామీ..చంద్రబాబు అస్మదీయుడు అని ఆరోపించిన వైసీపీ నేతలు..పెద్దలు ఇప్పుడు అదే మెఘా సంస్థకు ఇప్పుడు ఎందుకింతలా దాసోహం అంటోంది. అంటే అటు చంద్రబాబు అయినా..ఇటు జగన్ అయినా అధికారంలో ఉంటే ఓ మాట...ప్రతిపక్షంలో ఉంటే మరో మాట. ముఖ్యమంత్రి ఎవరైనా..రాష్ట్రం ఏదైనా హవా మెఘాదే అన్నట్లు ఉంది ఈ తీరు. కొత్తగా చేపట్టదలచిన ఈ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణ పనులు అన్నీ ఓ పథకం ప్రకారం కేటాయించారనే విమర్శలు ఆ శాఖ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి. పదహారు కాలేజీలు ఒక్కరికే ఇస్తే మరీ ఫోకస్ ఎక్కువ అవుతుందని భావించి.. ఆరు కాలేజీలను మాత్రం ఓ రెండు సంస్థలకు ఇచ్చేసి..మిగిలిన పది కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణ కాంట్రాక్ట్ ను మాత్రం మెఘాకు అర్పించారు. ఈ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణ వ్యయం మొత్తం 7880 కోట్ల రూపాయలు అయితే ఒక్క మెఘా సంస్థకు దక్కిన పనుల విలువ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వరకూ ఉంది. మెఘాకు కేటాయించిన నిర్మాణ పనుల్లో ఒక్కో కాలేజీకి గరిష్టంగా 550 కోట్ల రూపాయలు, 525 కోట్ల రూపాయలు..ఎక్కువ శాతం 475 కోట్ల రూపాయలు అలా ఉన్నాయి.
ఇది అంతా ఓ పక్కా పథకం ప్రకారం..ప్లాన్ ప్రకారమే సాగిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు రహదారుల నిర్మాణంతో పలు పనులకు ఏపీలో కాంట్రాక్టర్లు ముందుకు రావటంలేదు. దీనికి కారణం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఒకటి. కానీ మెడికల్ కాలేజీ ల విషయంలో మాత్రం కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు విషయంలో ముందస్తు హామీలు తీసుకునే రంగంలోకి దిగారంటున్నారు. ఈ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి కేంద్రం కూడా కొంత మేర నిధులు సమకూర్చనుందని అధికార వర్గాలు తెలిపాయి. పదహారు మెడికల్ కాలేజీల్లో మెఘా సంస్థకు పిడుగురాళ్ల, మచిలీపట్నం, అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుగొండ కాలేజీలు దక్కాయి. మిగిలిన ఆరు కాలేజీలను ఎన్ సీసీతోపాటు మరో కంపెనీకి కేటాయించారు. ఈ పనుల్లో కొన్ని ప్యాకేజీలుగా ఇవ్వగా...నాలుగు పనులను మాత్రం ఒకే సంస్థకు ఇచ్చారు.