మచిలీపట్నం ఓడరేవు కథ మళ్ళీ మొదటికే
రెండవ సారి టెండర్లకూ ముందుకు రాని నిర్మాణ సంస్థలు
ఈపీసీ పద్దతే ప్రధాన సమస్య అంటున్న అధికారులు
బూట్ ను కాదని..ఈపీసీని ఎంచుకోవటం వెనక పెద్ద కథే
అసలు ఈ ఓడరేవు పట్టాలెక్కుతుందా?
తొలిసారి ఈ ఓడరేవుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేశారు. అప్పుడు మైటాస్ కు ఈ ప్రాజెక్టు దక్కగా..ఆ సంస్థ వివాదాల్లో కూరుకోవటంతో నవయుగా సంస్థ ఎంటరైంది. ఇదే ఓడరేవుకు 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ శంకుస్థాపన చేశారు. కానీ వైఎస్ హయాంలో, చంద్రబాబు జమానాలో జరిగింది శూన్యం. జగన్ అధికారంలోకి వచ్చారు..మచిలీపట్నం ఓడరేవు బాధ్యతల నుంచి నవయుగాను తప్పించారు. ప్రభుత్వమే ఓడరేవు నిర్మాణానికి ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) పద్దతిలో టెండర్లు పిలిచారు. రెండుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క సంస్థ కూడా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. అసలే నిధుల కొరతతో సతమతం అవుతున్న ఏపీ సర్కారు ఈ పోర్టును సొంత నిధులతో నిర్మించి..నిర్వహణను మాత్రం ప్రైవేట్ సంస్థకు..అదీ అస్మదీయ సంస్థకు అప్పగించాలని వ్యూహం రచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓ వైపు గంగవరం ఓడరేవులో ఉన్న వాటాలను అమ్ముకుని..ఇప్పుడు సొంత నిధులతో పోర్టు నిర్మించి ప్రైవేట్ సంస్థకు నిర్వహణకు ఇవ్వటం ఏమిటో అర్ధం కావంటలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నిజంగా జగన్ ప్రభుత్వానికి మచిలీపట్నం ఓడరేవును పూర్తి చేసి..కృష్ణా జిల్లా ప్రగతికి బాటలు వేయాలనుకుంటే ఈ ప్రాజెక్టును బిల్ట్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ ( బీవోవోటీ) కింద టెండర్లు పిలిచేది అని..కానీ అందుకు భిన్నంగా ఈపీసీ పద్దతిలో టెండర్లు పిలవటంతో నిర్మాణ సంస్థలు ఏవీ ముందుకు రావటంలేదని చెబుతున్నారు.
బీవోవోటీ పద్దతిలో అయితే నిర్మాణ సంస్థ నిధులు సమకూర్చుకుని ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం కొన్ని సంవత్సరాలు ఓడరేవు నిర్వహించి..తర్వాత తిరిగి దీన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. రోడ్ల పనులకే సర్కారు బిల్లులు చెల్లించటంలేదని ఏపీలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా పనులకు టెండర్లు వేయకుండా దూరం దూరంగా ఉంటున్నారు. అలాంటిది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల పనులు దక్కించుకుని సర్కారు దయతో ముందుకు సాగాల్సిన అవసరం తమకెందుకు అని నిర్మాణ సంస్థలు దూరంగా ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. జగన్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్న కాంట్రాక్టర్ కు కూడా బిల్లులు చెల్లించకుండా చుక్కలు చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి మారిన పరిస్థితుల్లో తెలంగాణ నుంచి వచ్చే కార్గో ట్రాఫిక్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మచిలీపట్నం పోర్టు లాభదాయకంగానే ఉంటుందని చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈపీసీ పద్దతి కింద ఈ ఓడరేవు ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ఏవీ ముందుకు వచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటుందా లేక ఈపీసీ పద్దతిలో ముందుకు వెళటానికే మొగ్గుచూపుతుందా అన్నది వేచిచూడాల్సిందే. ఒకప్పుడు కాంట్రాక్టర్లు పనులు అంటే వాటిని దక్కించుకునేందుకు పరుగులు పెట్టేవారు. వేల కోట్ల రూపాయల పనులు చేజిక్కించుకునేందుకు పలు అడ్డదారులు కూడా తొక్కేవారు. పని ఇస్తే ప్రభుత్వంలోని పెద్దలకు కమిషన్లు ఇచ్చుకునేవారు. కానీ ఇప్పుడు ఏపీలో సీన్ రివర్స్ అయింది. అది రోడ్డు పని అయినా..ఓడరేవు పని అయినా టెండర్లు పిలిచి బాబూ పనులు చేయండి అని బతిమాలినా మాకొద్దు బాబోయ్ అంటూ పరార్ అవుతున్నారు. ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పేర్ని నాని దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ మచిలీపట్నం పోర్టు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఊరుకోవటం తప్ప..దీనిపై పెద్దగా స్పందించలేని పరిస్థితిలో ఉన్నారు. వాస్తవానికి జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నవయుగా టెండర్ రద్దు చేశాక..ఓ మూడు అగ్రశ్రేణి సంస్థలను ఒకేతాటిపైకి తెచ్చి దీన్ని అప్పగించాలని చూశారు. కానీ ఎందుకో ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాలేదు.