Telugu Gateway
Telugugateway Exclusives

కెటీఆర్ సెంటిమెంట్ నే నమ్ముకున్నారా?!

కెటీఆర్ సెంటిమెంట్ నే నమ్ముకున్నారా?!
X

కాంగ్రెస్ అంటే ఢిల్లీ గులాములు..బిజెపి అంటే గుజరాత్ గులాములా?

ఎన్నికలొస్తేనే కెసీఆర్ కు కాంగ్రెస్, బిజెపి ఫెయిల్యూర్స్ గుర్తొస్తాయా?

హైదరాబాద్ గులాబీలా?. గుజరాత్ గులాములా?. ఇదీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ గులాములు అనే విమర్శలు. ఇప్పుడు బిజెపి అధికారంలో ఉంది కాబట్టి,ప్రధానిగా నరేంద్రమోడీ ఉన్నారు కాబట్టి గుజరాత్ గులాములు?. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న బిజెపి అభ్యర్ధులు అందరూ తెలంగాణ వాళ్ళు..హైదరాబాద్ వాళ్లు కదా?. వాళ్లు గుజరాత్ గులాములు ఎలా అవుతారు?. బిజెపితో,ప్రధాని నరేంద్రమోడీతో రాజకీయంగా, విధానాల పరంగా విభేదించవచ్చు. కొట్లాడొచ్చు. అంతే కానీ..ఒక్క టీఆర్ఎస్ మాత్రమే పార్టీ..మిగిలిన పార్టీలు ఏవీ పార్టీలు కావు అనే తరహాలో మరోసారి మంత్రి కెటీఆర్ 'సెంటిమెంట్'ను రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంత కాలంగా టీఆర్ఎస్ నెగ్గుకొచ్చిందే తెలంగాణ సెంటిమెంట్ మీద. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ ను వాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరేళ్ల పాలన తర్వాత కూడా ఎన్నికలకు ముందు ఉచిత హామీలు ఇస్తాన్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు..ఏదైతే ఢిల్లీ గులాములు, ఆంధ్రా పార్టీలు అని కాంగ్రెస్, టీడీపీని విమర్శించి రాజకీయంగా లబ్ది పొందిందో అదే టీఆర్ఎస్ అలాంటి గులాముల పార్టీ నుంచి, టీడీపీ నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకుంది. అంత ఎందుకు..తాజాగా బిజెపి నేతలను కూడా టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అంటే ఎంతటి వారైనా టీఆర్ఎస్ లో చేరితే పునీతులైపోతారా?. కరోనా కష్టకాలంలో నగర ప్రజలను ఆదుకునేందుకే సీఎం కెసీఆర్ వరాలు ప్రకటించారు అని చెబుతున్నారు.

అసలు ఇంత కాలం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను ఇవి అమలు చేయకుండా అడ్డుకున్నది ఎవరు?. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సీఎం కెసీఆర్ కు కేంద్రంలోని బిజెపి, కాంగ్రెస్ విపలమైన విషయాలు గుర్తొస్తాయి. గతంలోనూ ఇదే మాట చెప్పారు. తాను, అసదుద్దీన్ ఓవైసీ కలసి ప్రత్యేక విమానాలు కూడా బుక్ చేసుకున్నాం..మీకు తెలియదు..ఎలా దేశమంతా పర్యటిస్తామో చూడండి అని మీడియాతో వ్యాఖ్యానించారు అప్పట్లో. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు రావటంతో మరోసారి అదే సీన్ రిపీట్ అవుతోంది. నిజంగా కెసీఆర్ చెబుతున్నట్లు దేశానికే సంపద సృష్టించే పాఠాలు చెప్పగలిగే స్థితిలో ఉన్నప్పుడు ముందు తెలంగాణా రాష్ట్రాన్ని అప్పులు లేని రాష్ట్రంగా మార్చి దేశానికే ఓ మోడల్ గా చేయవచ్చు కదా?. ఒక్క మాటలో చెప్పాలంటే టీఆర్ఎస్ నేతల తీరు వల్లే ఎక్కువ మంది బిజెపివైపు మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూస్తుంటే అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుకుని బయటపడాలని చూస్తున్నట్లు కన్పిస్తోంది.

Next Story
Share it