అన్నా...చెల్లెల ట్విట్టర్ పోటీ!
కెటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంంగాణ మంత్రి. కల్వకుంట్ల కవిత . ఎమ్మెల్సీ..మంత్రి కెటీఆర్ చెల్లి. వీరిద్దరూ ఇప్పుడు ట్విట్టర్ లో పోటీపడుతున్నట్లు కన్పిస్తోంది వాళ్ళ ట్వీట్స్ చూస్తుంటే. కెటీఆర్ ఎప్పటి నుంచో పలు అంశాలపై ట్వీట్స్ చేయటంలో ముందు వరసలో ఉంటారు. ఇప్పుడు కవిత కూడా అన్నకు పోటీ వస్తున్నట్లు ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. శనివారం నాడు హైదరాబాద్ కు బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్న విషయం తెలిసిందే. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశ ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు అమిత్ షా నగరానికి వస్తున్నారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని మంత్రి కెటీఆర్ ఆయనకు ఏకంగా 27 ప్రశ్నలు సంధించారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తాను అడిగే ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 'గుజరాత్‌పై వల్లమాలిన ప్రేమ.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ నిజం కాదా? తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ.. గుజరాత్‌కు ఆగమేఘాలపై నిధులు కేటాయించడం దేనికి సంకేతం'' అని ప్రశ్నించారు. 'విభజన చట్టంలోని ఒక్క హామీ అయినా నెరవేర్చారా? కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఒక్క విద్యా సంస్థ పేరైనా చెబుతారా? మెడికల్ కాలేజీలు ఎందుకు మంజూరు చేయలేదు? అంటూ పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని దుయ్యబట్టారు.
వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. పత్తా లేకుండా పోవుడు బీజేపీ అగ్ర నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కెటీఆర్ తరహాలోనే మంత్రి అమిత్ షాకు ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ''ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణానికి, పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లకు మీ సమాధానం ఏంటి? ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ ఈఆర్, ఐఐఐటి, ఎన్ఐడి, మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో వివరించాలి'' అని కవిత పేర్కొన్నారు. తెలంగాణకు బకాయి ఉన్న మూడు వేల కోట్ల రూపాయల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు ఎప్పుడు చెల్లిస్తారు.వెనకబడిన ప్రాంతాల డెవలప్ మెంట్ గ్రాంట్ 1350 కోట్లు, జీఎస్టీ పరిహారం 2247 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా మంత్రి కెటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ట్విట్టర్ వేదికగగా ఇంచుమించు ఒకే అంశాలను ప్రస్తావిస్తూ ట్వీట్స్ చేయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.