కెసీఆర్ కే కాన్ఫిడెన్స్ పోయిందా?!
తెలంగాణ కోసం పీకెను తెచ్చుకుని..దేశ రాజకీయాల్లో పాత్రా!
మోడీపై కెసీఆర్ కు కోపం వస్తే అందరికి రావాలి..!
తెలంగాణలో మరోసారి గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవటానికి రెడీ అయిన సీఎం కెసీఆర్ కు ఆయనపై ఆయనకే నమ్మకం పోయిందా?. తెలంగాణ జాతిపితగా పిలిపించుకోవటానికి ఎంతో ఇష్టపడే ఆయనకు మరొకరు వచ్చి. తాను సాధించిన రాష్ట్రంలో రాజకీయ సలహాలు ఇవ్వాలా?. ఇది దేనికి సంకేతం. తనకు తప్ప మరెవరికీ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టడం రాదని చెప్పే కెసీఆర్ కు ..ఇప్పుడు పీకె సాయం కావాల్సి వచ్చింది అంటే ఎక్కడో లెక్కల్లో తేడా కొడుతోంది. మరి తెలంగాణాలో గెలుపు కోసం పీకె సాయం తీసుకోవాలని నిర్ణయించిన కెసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీ పెట్టి ఏమి సాధించగలరు. ఆయన బలం..బలగం ఉన్నది అంతా ఇక్కడే. తనకు బలమైన పునాదులు ఉన్న చోటే గెలుపు కోసం వేరేవారి సాయం తీసుకుని..దేశంలో కెసీఆర్ చక్రం తిప్పటం..దేశ రాజకీయాలను శాసించటం సాధ్యం అవుతుందా?.. కేంద్రం లో అయినా..రాష్ట్రంలో అయినా నెంబర్ గేమ్ ఆధారంగానే రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నదే మొత్తం 17 ఎంపీ సీట్లు. మొత్తానికి మొత్తంగా కెసీఆర్ కు వస్తాయనుకున్నా వీటితో కెసీఆర్ చెబుతున్నట్లు దేశ రాతను..విధానాలను నిర్ణయించే శక్తి ఆయనకు వస్తుందా?. అది జరిగే పనేనా?.
ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణలో మాత్రం కెసీఆర్ పై వ్యతిరేకత తగ్గటం లేదని సమాచారం. దీనికి ప్రధాన కారణం కెసీఆర్ చెప్పేదొకటి..చేసేది మరొకటి. పలు సర్వేల్లోనూ ఈ విషయం పదే పదే వెల్లడికావటంతో అటెన్షన్ డైవర్షన్ కోసమే కెసీఆర్ ఈ ఎటాక్ మోడీ, దేశ రాజకీయ అంశాలను ఎంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నిజానికి రాఫెల్ డీల్ పై దేశమంతా రచ్చ జరిగిన సమయంలో కెసీఆర్ అసలు దీనిపై స్పందించనే లేదు. కానీ ఇప్పుడు ఆయన అకస్మికంగా రాఫెల్ డీల్ పై కేసు వేస్తాను..జైలుకు పంపిస్తాను అని చెబుతున్నారు. అంతేకాదు..ఎప్పుడో ముగిసిన పోయిన అమెరికా ఎన్నికలు..అమెరికాలో జరిగిన హౌడీ మోడీ సభ గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. కెసీఆర్ చెప్పినట్లు అమెరికా వ్యవహరాల్లో భారత్ జోక్యం చేసుకోవటం అనేది ఏ మాత్రం సహేతుకం కాదు. కానీ ఈ అంశంపై కెసీఆర్ తన వైఖరిని చెప్పాల్సింది సభ జరిగినప్పుడు...మోడీ ప్రచారం చేసినప్పుడు కదా. అప్పుడు అసలు నోరెత్తకుండా ఉండి ఇప్పుడు దీనిపై మాట్లాడటంలో ఔచిత్యం ఏమిటి?. అంటే కెసీఆర్ కు నవ్వొస్తే అందరూ నవ్వాలి. కెసీఆర్ కు కోపం వస్తే అందరూ అరవాలి. ఇదీ ప్రధాని మోడీ విషయంలో ఆయన తీరు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల విషయంలో ఆయన వేసిన పిల్లిమొగ్గలు ఎన్నో. ఓ దశలో వాటిని అనుమతించక ఏమీ చేయలేం అని ప్రకటించారు. తర్వాత మళ్ళీ పూర్తిగా రివర్స్ గేర్ వేశారు. కరోనా సమయంలో ప్రధాని మోడీ వైద్యులకు సంఘీభావంగా ఓ సారి దీపాలు వెలిగించాలని..మరో సారి ప్లేటులు తీసుకుని కొట్టాలని కోరారు. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలోప్రధాని మోడీపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఆ సమయంలో సీఎం కెసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిపై ఇలా ట్రోలింగ్ చేస్తారా?. సంఘీభావం తెలపాలంటే ఇలా చేయటం సంస్కారమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మోడీ ప్రతిపాదనల్లో ఎలాంటి లాజిక్ లేకపోయినా సరే కెసీఆర్ కు నచ్చింది సమర్ధించారు. అంతే కాదు.. నోట్ల రద్దు తోపాటు పలు అంశాలపై అసలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై కానీ..మోడీపై కానీ మాట్లాడటానికి కూడా ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చేవారు కాదు కెసీఆర్.
ఇదిలా ఉంటే ఇప్పుడు కేంద్ర మంత్రుల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని వారి జాతకాలు చెబుతానంటూ ప్రకటిస్తున్నారు. ఇదే కెసీఆర్ గత ఎన్నికలకు ముందు తాను రెండవసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల అవినీతి చిట్టా బయటకు తీస్తానని..వారి సంగతి తేలుస్తానని ప్రకటించారు. తొలిసారి వచ్చాక చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అంటారని ఆగిపోయానని..కానీ ఈ సారి అలా ఉండదని ప్రకటించారు. ఆయన రెండవ సారి అధికారంలోకి వచ్చి కూడా మూడేళ్లు దాటిపోయింది. ఇప్పటివరకూఐ ఆయన స్వయంగా చెప్పిన కాంగ్రెస్ హయం నాటికి హౌసింగ్ స్కామ్ పై కానీ ..ఇతర అంశాలపై కానీ చర్యలు లేవు. ఇప్పుడు మోడీపై..బిజెపిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఈ దఫా కూడా కాంగ్రెస్ నేతలు అవినీతి చర్యల నుంచి మినహాయింపు కల్పించినట్లే భావించాలేమో. మొత్తం మీద చూస్తే తెలంగాణలో క్షేత్ర స్థాయిలో తనపై పెరుగుతున్న వ్యతిరేకతపై ఎక్కడా చర్చ లేకుండా.. తెలంగాణ రాజకీయం అంతా కూడా కెసీఆర్ వర్సెస్ మోడీగా చూపిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టారంటున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రధాని మోడీ పాత వీడియోలను కూడా మీడియా సమావేశంలో చూపించారు. అలా మాట ఇచ్చిన తప్పిన వీడియోలు కెసీఆర్ వి చూపించాలంటే నెల రోజులు కూడా చాలవని ఓ నేత వ్యాఖ్యానించారు.