అప్పుడు కెసీఆర్..ఇప్పుడు కెటీఆర్
ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం. తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. కానీ కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుపెట్టి చేప పిల్లల పంపిణీతో సహా ఎన్నో అంశాలపై అవినీతి ఆరోపణలు చేశారు. చేతనైతే కేసులు పెట్టుకోండి అని సవాళ్లు విసిరారు. కానీ జరిగింది శూన్యం. కేసులు పెడితే విచారణకు ఫైళ్లు ఇవ్వాల్సింది ప్రభుత్వమే. వివరాలు బహిర్గతం చేయాల్సిందిగా కూడా ప్రభుత్వమే. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు దగ్గర నుంచి కొత్త సచివాలయ ప్రాజెక్టు వరకూ అంచనాల సంగతిపై ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మంత్రి కెటీఆర్ దూషిస్తే ఏకంగా రాజద్రోహం కేసులు పెడతామంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇదే రాజద్రోహం కేసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందరి చరిత్ర తమ దగ్గర ఉందని హెచ్చరికలు జారీ చేశారు కెటీఆర్. మియాపూర్ భూ కుంభకోణం వెలుగుచూసినప్పుడు కూడా ప్రభుత్వం విమర్శలు చేస్తే అప్పట్లో మంత్రి హరీష్ రావు కూడా ఇలాగే కాంగ్రెస్ నేతల భూ జాతకాలు అన్నీ తమ దగ్గర ఉన్నాయని..వాటిని బయటపెడతామని హెచ్చరించారు. మియాపూర్ కుంభకోణం అలాగే సద్దుమణిగింది..కాంగ్రెస్ నేతల జాతకాలు బయటపెట్టడం కూడా ఆగిపోయింది. మంత్రి కెటీఆర్ దగ్గర నిజంగా అందరి జాతకాలు ఉంటే బయటపెట్టాలి కదా?. తప్పులు చేసిన వారిపై చర్యలకు ముహుర్తాలు చూస్తారా?. సమాచారం ఉన్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలి కదా?. అంటే ప్రత్యర్దులు చేసిన తప్పులు తెలిసి కూడా వాటిని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకుందామని తొక్కిపెడుతున్నట్లు అనుమానించాల్సిన పరిస్థితిని నేతలే కల్పిస్తున్నారు. అంత ఎందుకు స్వయంగా ముఖ్యమంత్రి కెసీఆర్ మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వందల కోట్ల రూపాయల స్కామ్ చేశారని..ఆయనపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ ఏడేళ్ళు అయింది..ఇప్పటివరకూ కాంగ్రెస్ నేతలు చేసిన స్కామ్ లపై చర్యలు తీసుకోలేదు. ఆ స్కామ్ కు సంబంధించి ఏసీబీ నివేదికలు ఉన్నాయని బహిరంగంగా ప్రకటించి మరీ వదిలేశారు. అంటే ఇది కూడా రాజకీయ సెటిల్ మెంట్ లో భాగంగానే సెటిల్ అయినట్లు కన్పిస్తోంది. ఈ లెక్కన కాంగ్రెస్ స్కామ్ స్టర్లను కూడా కెసీఆర్ సర్కారు కాబడుతుంది అన్న మాట. మంత్రి కెటీఆర్ తెలంగాణకు అసలైన విమోచన దినోత్సవం జూన్ 2 మాత్రమే అని సెలవిస్తున్నారు. కానీ ఆయన స్వయంగా అసెంబ్లీ లో మాట్లాడుతూ 'తెలంగాణ ప్రజలు రెండవ తరగతి పౌరులు ఉంటున్నారు. తమ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోలేని జాతి ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది కేవలం తెలంగాణ జాతి మాత్రమే. 1948 సెప్టెంబర్ 17 నాడు సముపార్జించుకున్న స్వాతంత్ర్యాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోలేదని జాతి తెలంగాణ మాత్రమే. పక్కనున్న హైదరాబాద్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. మరాడ్వా మహారాష్ట్రలో ఉంటే అక్కడ కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేసిన పెద్దలకు మాత్రం మనసు రావటం లేదు' అంటూ విమర్శించారు. కానీ ఇప్పుడు అదే కెటీఆర్ జూన్ 2 మాత్రమే తెలంగాణ విమోచన దినోత్సవం అంటూ మాట మారుస్తున్నారు.