Telugu Gateway
Telugugateway Exclusives

రాష్ట్రాల‌ను రేట్లు త‌గ్గించ‌మంటేనే జ‌గ‌న్, కెసీఆర్ ల‌ను తాకిన సెగ‌

రాష్ట్రాల‌ను రేట్లు త‌గ్గించ‌మంటేనే జ‌గ‌న్, కెసీఆర్ ల‌ను తాకిన సెగ‌
X

ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్రం అడ్డ‌గోలుగా పెంచినా నోరు తెర‌వ‌ని వైనం

ఇప్పుడు ఒకరు యాడ్స్ తో ఎటాక్..మ‌రొకరు ప్రెస్ మీట్స్ తో ఎటాక్

ప్ర‌జ‌ల కోణంలో అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఎందుకు మౌనాన్ని ఆశ్ర‌యించిన‌ట్లు?

రాజ‌కీయం. అంతా రాజ‌కీయ‌మే. ఇక్క‌డ ఎవ‌రికీ ప్ర‌జ‌ల కోణం లేదు. కేంద్రం వ‌ర‌స పెట్టి ఎడాపెడా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచుకుంటూ పోయినా ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎవ‌రూ మీడియా స‌మావేశం పెట్టి ఎందుకు ఇలా పెంచుతున్నారు..ఇది ప్ర‌జ‌ల‌పై పెనుభారం అని మాట్లాడింది లేదు. రేట్లు త‌గ్గించే వ‌ర‌కూ ఊరుకోం అని ఇప్పుడు మాట్లాడుతున్న‌ట్లు ఇంత కాలం ఎందుకు మాట్లాడ‌లేదు. కేంద్రం తాజాగా నామ‌మాత్రంగా రేట్లు త‌గ్గించి..రాష్ట్రాలు కూడా త‌గ్గించాలని కోర‌టంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు అయిన జ‌గ‌న్, కెసీఆర్ ల‌కు సెగ త‌గిలింది. ఇప్ప‌టి వ‌ర‌కూ వీటిపై పెద్ద‌గా నోరు తెర‌వ‌ని సీఎంలు ఇద్ద‌రూ పెంచింది ఎంత‌..త‌గ్గించింది ఎంత అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఒకరు యాడ్స్ తో ఎటాక్ చేస్తే..మ‌రొక‌రు ప్రెస్ మీట్స్ తో ఎటాక్ ప్రారంభించారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్ర‌భుత్వాలు పెంచింది కేంద్రమే.త‌గ్గించాల్సింది కేంద్ర‌మే అంటూ వాదిస్తున్నాయి. అంతే కాదు..కేంద్రం ధ‌ర‌ల పెంపుతో ఇంత సంపాదించింది అంటూ లెక్క‌లు చెబుతున్నారు. మ‌రి ఇవే లెక్క‌లు వారం రోజుల ముందు వ‌ర‌కూ ఎందుకు చెప్ప‌లేదు. కేంద్రాన్ని ఎందుకు ప‌న్నులు త‌గ్గించాల‌ని ఇప్పుడు కోరుతున్న‌ట్లు కోర‌లేదు. ఇవి స‌హ‌జంగా ఎదుర‌య్యే ప్ర‌శ్న‌లు. కేంద్రం ఎంత రేట్లు పెంచితే ఆ మేర‌కు ఎంతో కొంత రాష్ట్రాల‌కు వాటా వ‌స్తుంది కాబట్టి ఇప్ప‌టివ‌ర‌కూ ఏదో తూతూ మంత్రపు విమ‌ర్శ‌లు చేసి వ‌దిలేశారు. కానీ రాజ‌కీయంగా బిజెపి రాష్ట్ర శాఖ‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఎటాక్ ప్రారంభించ‌టంతో తెలంగాణ‌; ఏపీ సీఎంలు కేంద్రంపై ఎటాక్ ప్రారంభించారు. పెట్రో పాపం కేంద్రానిదే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అంత‌ర్జాతీయంగా క్రూడ్ ధ‌ర‌లు అత్యంత క‌నిష్ట స్థాయికి త‌గ్గినా కూడా కేంద్రం మాత్రం ఆ ఫ‌లితాల‌ను వినియోగ‌దారుల‌కు బ‌ద‌లాయించ‌కుండా ఖ‌జానా నింపుకునేందుకే ప్ర‌య‌త్నించింది.

అంతే కాదు ప్ర‌జలంతా క‌రోనా కారణంగా తీవ్ర క‌ష్టాల్లో ఉన్నా కనిక‌రం ఈ చూపించ‌ని మోడీ స‌ర్కారు వ‌ర‌స పెట్టి పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్ల‌ను పెంచుకుంటూ పోయింది. వాస్త‌వానికి యూపీఏ స‌ర్కారు ఎప్పుడో పెట్రోల్ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి నియంత్రిత ధ‌ర‌ల విధానం(ఏపీఏ) అమ‌ల్లోకి తెచ్చింది. దీని ప్ర‌కారం అంత‌ర్జాతీయంగా ఉన్న క్రూడ్ ధ‌ర‌ల ఆధారంగా దేశంలో పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌ల్లో మార్పులు జ‌ర‌గాలి. అయితే మోడీ స‌ర్కారు మాత్రం సుంకాలు..సెస్ లతో త‌న ప‌నికానిచ్చేసుకుంది. ఐదు రోజుల క్రితం కేంద్రం పెట్రోల్ పై ఐదు రూపాయ‌లు, డీజిల్ పై 10 రూపాయ‌ల ఎక్సైజ్ సుంకాల‌ను త‌గ్గించింది. అయితే పెంచిన రేట్ల‌తో పోలిస్తే త‌గ్గించింది మాత్రం స్వ‌ల్ప‌మే. కేంద్రం ఎంతో కొంత త‌గ్గించింది కాబ‌ట్టి మీరు కూడా త‌గ్గించాలంటూ బిజెపి రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ప్రారంభించ‌టంతోపాటు ప్ర‌భుత్వాలు కూడా ఎటాక్ ప్రారంభించాయి. అయితే ఇంత కాలం రెండు ప్ర‌భుత్వాలు మౌనంగా ఉన్న విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Next Story
Share it