Telugu Gateway
Telugugateway Exclusives

పెగాసెస్ స్పైవేర్ హ్యాకింగ్ పై..కెసీఆర్, జ‌గ‌న్ సైలంట్!

పెగాసెస్ స్పైవేర్ హ్యాకింగ్ పై..కెసీఆర్, జ‌గ‌న్ సైలంట్!
X

ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఫోన్ల ట్యాపింగ్ పై వైసీపీ ఆందోళ‌న‌

తెలంగాణ స‌ర్కారుపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

పెగాసెస్ స్పైవేర్ తో దేశంలో కీల‌క నేత‌లు, జడ్జీలు, మీడియా ప్ర‌తినిదుల ఫోన్ల‌ను హ్యాక్ చేసిన అంశంపై దేశంలో పెద్ద దుమార‌మే రేగుతోంది. పార్ల‌మెంట్ స‌మావేశాలు కూడా ఈ అంశంపై అట్టుడుకుతున్నాయి. అయితే ఇంతటి కీల‌క విష‌యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, అధికార పార్టీలు మౌనాన్ని ఆశ్ర‌యించ‌టం విశేషం. వాస్త‌వానికి వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు త‌మ ఫోన్ల‌ను ట్యాప్ చేయించార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. అంతేకాదు..దీనిపై ఫిర్యాదు చేయ‌టంతో పాటు ఏకంగా కోర్టులో కేసు కూడా వేశారు. జ‌గన్ తోపాటు త‌మ కీల‌క నేత‌లు ఫోన్లు ట్యాప్ చేశార‌ని అప్ప‌ట్లో వైసీపీ సీనియ‌ర్ నేత స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి పిటీష‌న్ దాఖ‌లు చేశారు. విచిత్రం ఏమిటంటే వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోప‌ణ‌లు చేసింది. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ అయితే ఏకంగా ముఖ్య‌మంత్రుల ఫోన్ల‌ను కూడా కేంద్రం ట్యాప్ చేస్తోంద‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ అధికార పార్టీగా, ఓ ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీగా కూడా క‌నీసం వైసీపీ నేత‌లు ఎవ‌రూ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ అంశంపై స్పందించిన దాఖ‌లాలు లేవు. తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ కూడా అధికార టీఆర్ఎస్, ముఖ్య‌మంత్రి కెసీఆర్ ఈ అంశంపై నోరువిప్ప‌లేదు. అయితే ఏడేళ్ళ‌కు పైగా తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపైనే కాంగ్రెస్ పార్టీ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఇటీవ‌ల కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. త‌మ నేత‌లు ఫోన్లు అన్నీ తెలంగాణ స‌ర్కారు ట్యాపింగ్ చేయించుతోంద‌ని ఆరోపించారు. అయితే దేశాన్ని కుదిపేస్తున్న కీల‌క అంశంపై ఇద్ద‌రు సీఎంలు మౌనంగా ఉండ‌టంపై అధికార వ‌ర్గాలు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. అధికారంలో ఎవ‌రు ఉంటే వారు ముఖ్యంగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌ను దెబ్బ‌తీసేందుకు ..వారి వ్యూహ‌ల‌ను ప‌సిగ‌ట్ట‌డంతో పాటు ర‌క‌ర‌కాల అవ‌స‌రాల‌కు ట్యాపింగ్ పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. మ‌రి ఈ పార్ల‌మెంట్ సమావేశాల్లో పెగాసెస్ స్పైవేర్ హ్యాకింగ్ అంశం ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. పార్ల‌మెంట్ లో అయినా అధికార వైసీపీ,టీఆర్ఎస్ లు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it