'కెసీఆర్ ముందస్తు ఫార్ములా' మళ్ళీ విజయం తెచ్చి పెడుతుందా?.
అయితే ఈ సారి కెసీఆర్ ముందస్తు ప్లాన్స్ అంత సాఫీగా సాగే ఛాన్స్ లు కన్పించటం లేదు. జూన్ లో అసెంబ్లీని రద్దు చేస్తే అప్పటి నుంచి ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంటుంది. చివరి నిమిషం వరకూ ఈసీ ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చితే...ఆరు నెలల గడువు ముగిసే నెల ముందు కేంద్రం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం మోడీ, కెసీఆర్ ల మధ్య సంబంధాలు అంత సవ్యంగా లేవనే విషయం తెలిసిందే. అప్పుడు టీఆర్ఎస్ మరింత చిక్కుల్లో పడటం ఖాయం. అనుకున్న ముందస్తు ఎన్నికల పని పూర్తికాకపోగా..ప్రజల్లో తీవ్ర అసహనం వచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా ఉంది. ముందస్తు వ్యూహంలో భాగంగానే కెసీఆర్ వ్యూహాత్మకంగా 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీతోపాటు ఈ బడ్జెట్ లో దళితబంధుకు అధిక నిధులు కేటాయింపులు చేయించారు. షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే ఏడాది చివరి వరకూ సర్కారుకు గడువు ఉంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ అన్ని పార్టీల్లో ఉంది.