Telugu Gateway
Telugugateway Exclusives

కెసీఆర్ నిర్ణయానికి భిన్నంగా కెటీఆర్ వెళ్లగలరా?

కెసీఆర్ నిర్ణయానికి భిన్నంగా కెటీఆర్ వెళ్లగలరా?
X

ఢిల్లీ గజగజలాడుతుందని చెప్పి..కేంద్రంతో ఘర్షణ ఉండదన్న కెసీఆర్

కెటీఆర్ మద్దతుతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందా?

జగన్..చంద్రబాబుతో కానిది కెటీఆర్ తో అవుతుందని గంటా నమ్ముతున్నారా?

అసలు ఎవరిని గందరగోళం పర్చటానికి ఇది అంతా?. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ప్రత్యక్ష్యం అయ్యారు. దేనికి అంటే...విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉద్యమానికి కెటీఆర్ మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపి..విశాఖలో పర్యటనకు రావాలని ఆహ్వానించారు. అయితే ముఖ్యమంత్రి కెసీఆర్ తాజాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ కేంద్రంతో తాము ఘర్షణ పడబోమని విస్పష్టంగా ప్రకటించారు. ఇదే కెసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మాత్రం తనను చూసి ఢిల్లీ గజగజ వణుకుతుందని..తాను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో వాళ్లకు తెలుసని వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఏదైనా పట్టుకుంటే అది పూర్తయ్యే వరకూ వదలడు అని కూడా వ్యాఖ్యానించారు. కానీ అనూహ్యంగా ఢిల్లీ వెళ్లి..ప్రధాని మోడీని కలసి వచ్చిన తర్వాత సీఎం కెసీఆర్ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. అంతే కాదు..ఢిల్లీపై పోరాటం షురూ చేస్తానన్న కెసీఆర్..తాజాగా కేంద్రం ఘర్షణ పెట్టుకోమని ప్రకటించారు.

మరి ఈ తరుణంలో ఏపీకి సంబంధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కెటీఆర్ విశాఖ వెళ్ళి ధర్నాలో పాల్లొంటారా?. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా?. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడితోపాటు పవన్ కళ్యాణ్ తో సహా పార్టీలు అన్నీ కేంద్రం తన నిర్ణయాన్ని పునర్ ఆలోచించాలని కోరుతుంటే బిజెపి సర్కారు అందుకు భిన్నంగా...వంద శాతం వాటాలు అమ్మేస్తామని..అమ్మటం కుదరకపోతే మూసేస్తామని ఘాటుగా ప్రకటనలు చేస్తోంది. ఈ తరుణంలో గంటా శ్రీనివాసరావు హైదరాబాద్ వచ్చి కెటీఆర్ మద్దతు కోరటంలో ఔచిత్యం ఏమిటి అన్నది కూడా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఓ వైపు టీఆర్ఎస్ సర్కారు కూడా కేంద్రం నుంచి తెలంగాణ కు దక్కాల్సిన ఐటిఐఆర్ ప్రాజెక్టుతో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలను సాధించుకోలేకపోయింది. అలాంటిది కెటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మాట వరసకు ఓ మద్దతు ప్రకటన ఇవ్వగానే సరిపోతుందా?. అసలు రెండు రాష్ట్రాలు కేంద్రం నుంచి చట్టబద్ధంగా దక్కాల్సిన హామీల అమలుకు ఏనాడైనా అసలు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రయత్నాలు చేశాయా?. అసలు ఆ ప్రయత్నమే జరగలేదు. అంతే కాదు..ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలు ఎన్నో. ఎంతసేపూ ఎవరికి వారు రాజకీయ ప్రయోజనాలు..వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప..రాష్ట్రాల కోణంలో ఆలోచించటానికి ఎవరూ ముందుకు రావటం లేదని అధికార వ్యాఖ్యాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులు చేయలేని పని కెటీఆర్ తో సాధ్యం అవుతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నమ్ముతున్నారా? అని ఓ నేత సందేహం వ్యక్తం చేశారు.

Next Story
Share it