Telugu Gateway
Telugugateway Exclusives

కెసిఆర్ నిర్ణయం..లాభమా...నష్టమా?!

కెసిఆర్ నిర్ణయం..లాభమా...నష్టమా?!
X

మోడీ ప్రైవేట్ పరం కంపెనీలన్నీ కెసిఆర్ సర్కారు కొంటుందా?!

కెసిఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు

ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా సాధ్యం అవుతుందా?

ప్రాజెక్ట్ లకు అవసరం అయితే స్టీల్ కొంటారు కానీ..స్టీల్ ప్లాంట్ కొంటారా?

అధికార , కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్

ఉద్యమ సమయంలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కెసిఆర్ తెలంగాణ కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక నిజాం సుగర్స్ పునరుద్ధరణపై చాలా హామీలే ఇచ్చారు. రాజకీయంగా దీన్ని పెద్ద ఎత్తున వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా తూఛ్...ఇప్పుడు సాధ్యంకాదు అని తేల్చేసారు. ఇది ఒక్కటే కాదు తెలంగాణకు చెందిన ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి ప్రకటనలే చేశారు కెసిఆర్. అవి అన్ని ఏమి అయ్యాయో అందరికి తెలుసు. తెలంగాణ సర్కారు ఒక వైపు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతోంది. కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేక చేతులు ఎత్తేస్తోంది. ఎన్నికల కోసం పెట్టిన దళిత బందు పథకానికి కూడా నిధుల కొరత ఉంది. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు...అసలు నిరుద్యోగ భృతి ఊసే లేదు. కానీ తెలంగాణ సర్కారు అకస్మాత్తుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలోని మోడీ సర్కారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి కచ్చితంగా ఆక్షేపణీయమే. అసలు ఆ ప్లాంట్ ఉన్న రాష్ట్రంలో అధికార వైసీపీ, సీఎం జగన్ ఈ విషయంలో లేఖలు రాసి చేతులు దులుపుకున్నారు. అఖిలపక్షాన్ని మోడీ వద్దకు తీసుకెళ్తానని హంగామా చేసినా అది కూడా మధ్యలోనే వదిలేసారు. ఈ తరుణంలో తెలంగాణ సీఎం కెసిఆర్ బిడ్డింగ్ లో పాల్గొనాలని ఆదేశించినట్లు వచ్చిన వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఎవరైనా అవసరమైన స్టీల్ కొనుక్కుంటారు కానీ...ఏకంగా స్టీల్ ప్లాంట్ కొంటారా ఒక సీనియర్ ఐఏఎస్ విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ తరపున సింగరేణి లేదా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సాగునీటి శాఖలు ఈఓఐ లో పాల్గొనే అవకాశం ఉంది అని ప్రకటించారు. ఇక్క్డడ కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నేరుగా ప్రభుత్వ సంస్థలే బిడ్స్ వేస్తాయా..లేక ఈ రంగంలో అనుభవం ఉన్న సంస్థలను కూడా భాగస్వాములు చేసి పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉన్న వైజాగ్ స్టీల్ ప్రాజెక్టు పై కన్నేస్తారా అనే చర్చ కూడా సాగుతోంది. ముందు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో బిడ్స్ దాఖలు చేయించి ...తర్వాత వాటాలు చేతులు మారటానికి కూడా అవకాశాలు ఉన్నాయని ఒక కార్పొరేట్ రంగ నిపుణుడు అభిప్రాయపడ్డారు. అయితే ఇది అంతా డీల్ సాఫీగా సాగితేనే అని వెల్లడించారు. అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ సీఎం కెసిఆర్ ల మధ్య మంచి సత్సబంధాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో తెర వెనక ఏమైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే బిఆర్ఎస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి మూవ్ తెలంగాణ లో అయనకు రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది అనే చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏవి ఓపెన్ చేయించ లేకపోయారు కానీ ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటారా అన్న విమర్శలు రావటం ఖాయం. అదే సమయంలో ఇందులో ప్రధాని మోడీ పై యుద్ధం కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయనే అనుమానాలు బలపడే అవకాశం ఉంది అని చెపుతున్నారు. కెసిఆర్ చెపుతున్నట్లు ఒక వేళ తెలంగాణ సర్కారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో దక్కించుకున్న స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహించటం అన్నది సాధ్యం కాదు అని...కచ్చితంగా ప్రైవేట్ భాగస్వాములను తీసుకురావాల్సి ఉంటుంది అని చెపుతున్నారు. అక్కడే అసలు కథ ఉంటుంది అని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it