బిజెపి తప్పులు నిజమే....మరి కెసీఆర్ ఫిరాయింపుల మాటేమిటి?!
కర్ణాటకలో..మధ్యప్రదేశ్ ల్లో బిజెపి ప్రజాతీర్పును అపహస్యం చేసింది. అక్కడ ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ప్రజల తీర్పును ఇలాగేనా గౌరవించేది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బిజెపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయా రాష్ట్రాల్లో కెసీఆర్ చెప్పినట్లు బిజెపి చేసింది అన్యాయం..అక్రమమే. అక్కడ అలా చేయటం ద్వారా బిజెపి అధికారం దక్కించుకుంది. అధికారం కోసమే రకరకాల ప్రలోభాలకు బిజెపి తెరతీసింది. కానీ మరి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణలో చేసింది ఏమిటి?. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు స్పష్టమైన మెజారిటీతో తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ లోకి చేర్చుకోలేదా?. ముందు కొంత మంది..తర్వాత కొంత మందిని చేర్చుకుంటూ చివరకు చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని విలీనం అంటూ కొత్త సంప్రదాయానికి తెరతీయలేదా?. అసలు ఏమి అవసరం ఉంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నట్లు. అంతే కాదు..కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లకు మంత్రి పదవులు సైతం ఇచ్చారు.
టీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే 88 సీట్లను గెలుచుకుంది. మరి కాంగ్రెస్ వాళ్లు అదనంగా వచ్చి చేరినందున జరిగిన అదనపు తెలంగాణ అభివృద్ధి ఎంత?. ఒక్క కాంగ్రెస్ శాసనసభా పార్టీని చీల్చటంతోనే ఆగలేదు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. విచిత్రం ఏమిటంటే సండ్ర వెంకటవీరయ్య ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ తప్ప...మరో పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతోనే కెసీఆర్ అటు కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చి ప్రజల తీర్పును అవమానించారని ఆ పార్టీ నేతలు గతంలోనే తీవ్ర విమర్శలు చేశారు. ఇదే కెసీఆర్ రాజశేఖరరెడ్డి హయంలో సాగిన ఫిరాయింపులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఫిరాయింపులను..చీలికలను ప్రోత్సహించి వాటికి రాజకీయ ఏకీకరణ అంటూ ఓ పేరు ఖరారు చేశారు. బిజెపి తప్పులను ఎత్తిచూపిన కెసీఆర్ తాను చేసిన పనులను మాత్రం కన్వీనెంట్ గా వదిలేశారు.