'కెసీఆర్' నిర్ణయాలు కాంగ్రెస్ కు కలిసొస్తాయా?!
తెలంగాణ రాజకీయం శరవేగంగా మారుతోంది. రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ పక్కా ప్లాన్ తో రాజకీయం చేసుకుంటూపోతున్నారు. తొలుత కాంగ్రెస్ ను ఖతం చేయాలని చూశారు..చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అసలు తెలంగాణలో బిజెపికి బలం ఎక్కడ ఉంది..మనకు అదెక్కడ పోటీగా నిలుస్తుందిలే అనుకున్నారు. కానీ కాంగ్రెస్ బలహీనం అయ్యాక..బిజెపి బలం పుంజుకోవటం ప్రారంభించింది. కీలక నేతలు కూడా ఆ పార్టీ బాట పట్టడం ప్రారంభించారు. ఇప్పుడు కెసీఆర్ కు బిజెపి సెగ బాగానే తగులుతోంది. అందుకే ఇప్పుడు ఆయన 'టార్గెట్ బిజెపి' అంటున్నారు. అందుకే ఎవరూ చేయనిరీతిలో అధికార పార్టీగా ఉండి..ప్రధాని దిష్టిబొమ్మల దగ్దం..చావు డప్పుల వంటి అసాధారణ కార్యక్రమాలకు పూనుకున్నారు. అయితే వీటిపై బిజెపి కూడా అంతే ఘాటుగా స్పందించింది. కెసీఆర్ వైఫల్యాలు ఎన్నో ఉన్నాయని....కొడితే చావు డప్పు ముందు ప్రగతి భవన్ ముందే కొట్టాలని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. అయితే తాజా పరిణామాలు తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగిన మాట వాస్తవమే. అయితే అది కాస్త పెరుగుతుంది అంటే సొంత పార్టీ నేతలు రంగంలోకి దిగి ఆ పెరిగిన దాన్ని వెంటనే మైనస్ చేస్తూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా తలెత్తిన వరి ధాన్యం సేకరణ సమస్యతోపాటు పలు అంశాలపై టీఆర్ఎస్, బిజెపిలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇది రాజకీయంగా తమకు కలసివస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను బిజెపి, బిజెపి వైఫల్యాలను టీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇద్దరూ తొడుదొంగలేనని..రాజకీయం కోసం ఇప్పుడే కొత్త నాటకానికి తెరతీశారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ అయినా..బిజెపి అయినా కాంగ్రెస్ గత పాలనపై విమర్శలు చేయాలే తప్ప..ఇప్పుడు ఆ పార్టీపై కొత్తగా వ్యతిరేకత పెంచేందుకు అవకాశాలులేవు. అదే బిజెపి కేంద్రంలో, టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. అంతే కాదు..ఈ రెండు పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయనవి ఎన్నో ఉన్నాయి. అంతే కాదు..కారణాలు వేర్వేరు అయినా ఆయా ప్రభుత్వాలపై వ్యతిరేకత కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.
టీఆర్ఎస్ అధినేత నేత, సీఎం కెసీఆర్ ఏ కారణంతో బిజెపిని టార్గెట్ చేసినా అది ఖచ్చితంగా రాజకీయంగా కాంగ్రెస్ కు లాభం చేయటం ఖాయం అని ఆ వర్గాలు ధీమాతో ఉన్నాయి. తాము పండించిన పంటను కేంద్రం కొంటుందా..రాష్ట్రం కొంటుందా అన్నది రైతులకు అవసరం లేదు. వాళ్ళకు సమస్య పరిష్కారం ముఖ్యం. కానీ ఇప్పుడు అదే సమస్యగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప...రైతుల సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవటం లేదు. అయితే ఈ సానుకూల వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఏ మేరకు మార్చుకుంటుంది..రాజకీయంగా దీని ద్వారా ఈ మేరకు లబ్దిపొందుతుంది అన్నది వేచిచూడాల్సిందే. టీఆర్ఎస్ తప్పిదాలను బిజెపి..బిజెపి తప్పిదాలను టీఆర్ఎస్ బహిర్గతం చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం క్రియేట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఇంత వరకూ అందుకు తగిన ప్రతిఫలాన్ని అనుభవించకపోవటం కూడా ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగానే ఉంది.