పదిహేను సంవత్సరాల ఫైల్స్... ఫోరెన్సిక్ ఆడిట్
జూబ్లిహిల్స్ హిల్స్ హౌసింగ్ కమిటీ నిర్ణయం
మురళీ ముకుంద్ అధికారాలకు కత్తెర
అక్రమాలు నిగ్గుతేలబోతున్నాయి. అవినీతి అనకొండలు బయటకు రావటం ఇక పక్కా. ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలకు సంబంధించిన ఫైళ్ళు పోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని జూబ్లిహిల్స్ హిల్స్ హౌసింగ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను కూడా ప్రముఖ సంస్థలు కెపీఎంజీ, డెలాయిట్ ల్లో ఒకదానికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆగస్టు 11న జరిగిన సమావేశంలో తీర్మానం కూడా చేశారు. డెలాయిట్, కెపీఎంజీ వంటి సంస్థలకు ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలు అప్పగించాలంటే చాలా ఖర్చు అవుతుందని..సొసైటీ దగ్గర ప్రస్తుతం అన్ని డబ్బులు లేవని కార్యదర్శిగా ఉన్న మురళీ ముకుంద్ అభ్యంతరం వ్యక్తం చేశారని కమిటీ సభ్యులు తెలిపారు. గత రెండు వారాలుగా మురళీ ముకుంద్ కార్యాలయానికి రాకుండా ఫైళ్లు ఇవ్వకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని సభ్యులు వెల్లడించారు. పోలీసులకు..సహకార శాఖ రిజిస్టార్ కు చేసిన ఫిర్యాదులో కూడా అవాస్తవాలే ప్రస్తావించారని వీరు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 11న జరిగిన సమావేశం మొత్తం సీసీటీవీ రికార్డుల్లో నమోదు అయిందని..అందరి వాయిస్ లు కూడా ఉన్నాయని ఓ కమిటీ సభ్యుడు వెల్లడించారు. కార్యదర్శిగా ఉన్న మురళీ ముకుంద్ ను ఫైళ్లు అడిగితే..ఇవ్వను ఏం పీక్కుంటారో పీక్కోండి అని అభ్యంతర భాషలో వ్యాఖ్యానించారని..ఈ విషయం కూడా సీసీటీవీ ఫుటేజ్..ఆడియో రికార్డు కూడా ఉందని..ఈ సమాచారాన్ని కమిటీ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
ప్రెసిడెంట్ బి. రవీంద్రనాథ్ పైళ్లు చూడటానికి వీలుగా కీస్ కావాలని అడిగితే..తాను ఇవ్వను అంటూ మురళీ ముకుంద్ ఫైర్ అయ్యారని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కార్యదర్శిగా ఉన్న మురళీ ముకుంద్ అధికారాలకు కత్తెర వేస్తూ మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయన కార్యదర్శి పదవిలో కొనసాగుతారు కానీ..అధికారాలు ఉండవన్నారు. బైలాస్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని..తమ సొసైటీ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మేనేజింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్ తప్ప..వ్యక్తిగతంగా ఎవరికీ ప్రత్యేక అధికారాలు ఉండవన్నారు. గత కమిటీలో ప్రెసిడెంట్ గా ఉన్న తుమ్మల నరేంద్రచౌదరి, అప్పటి కార్యదర్శి హనుంతరావులతో కుమ్మక్కు అయి తనకు ఓటు వేసిన సభ్యులకు కూడా మురళీ ముకుంద్ అన్యాయం చేస్తున్నారని కమిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.