ఒక ఎన్నిక...రెండు మీడియా సంస్థలకు బిగ్ షాక్
జూబ్లిహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లిహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో రెండు మీడియా సంస్థలకు బిగ్ షాక్ తగిలింది. అందులో ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ ఉండగా..మరోకటి ప్రముఖ ప్రింట్ మీడియా సంస్థ. తెరవెనక ఉండి ఓ ఫ్యానల్ కు పూర్తి మద్దతు ఇచ్చింది. అంతే కాదు..అసలు అదేదో అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన తరహాలో తొలిసారి జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలకు సంబంధించి పలు పత్రికల్లో జాకెట్ యాడ్స్ ఇచ్చి మరీ అందరినీ విస్మయానికి గురిచేశారు. అంతే కాదు..పలు పత్రికల్లో దీనికి సంబంధించి ప్రాయోజిత కథనాలు కూడా కోకొల్లలుగా వచ్చాయి. తాము తప్ప అసలు ఎవరూ అభివృద్ధి చేయలేరని..అభివృద్ధి అంతే తామే అన్నట్లు వ్యవహరించిన వారికి సొసైటీ ఓటర్లు షాక్ ఇచ్చారు. అంతే కాదు..మరో మీడియా సంస్థ మద్దతు ఉన్న ప్యానలే ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయటం మరో విశేషం. జెహెచ్ డబ్ల్యూఎస్ ప్యానల్ గా పోటీచేసిన ఆ ప్యానల్ సభ్యులే పూర్తిగా విజయం సాధించారు. కీలక మీడియా సంస్థల మద్దతుతో బరిలోకి దిగిన మరో ప్యానల్ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మీడియా సర్కిళ్ళతోపాటు పారిశ్రామికవర్గాల్లో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
అసలు ఈ పోటీని నివారించేందుకు ఓ మీడియా అధినేత ఎన్నికలకు ముందే రాజీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలు నడిపించారు. కానీ ఫలితాల్లో మాత్రం వారికి పూర్తిగా చేదు అనుభవం ఎదురైంది. అయితే కొత్తగా ఎన్నికైన సభ్యుల నుంచి అధ్యక్ష, కార్యదర్శులతోపాటు ఇతర కమిటీ ఎన్నిక మూడు, నాలుగు రోజుల్లో కొలిక్కి వస్తుందని చెబుతున్నారు. జెహెచ్ డబ్ల్యూఎస్ ప్యానల్ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ జెట్టితోపాటు రాజేంద్రప్రసాద్ వివి, రవీంద్రనాథ్ బి, మాదాడి శ్రీలక్ష్మీరెడ్డి, మాధవరెడ్డి ఆర్, ఆనంద్ కుమార్ , డాక్టర్ ఓం ప్రకాష్ అగర్వాల్, అదాల హిమబిందురెడ్డి ఇలా ప్యానల్ ప్యానల్ మొత్తం ప్రత్యర్ధులను ఓడించింది. కొత్త కమిటీ వచ్చిన తర్వాత గతంలో వచ్చిన పలు అవినీతి ఆరోపణలపై ఎలా ముందుకెళుతుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంత కాలం రకరకాల వ్యక్తులు, వ్యవస్థల మద్దతుతో నెట్టుకొచ్చిన వ్యక్తులు ఈ సవాల్ ను ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే. ఈ ఫలితాలతో కొంత మందికి కంటి మీద కునుకు లేకుండా పోయిందని చెబుతున్నారు.