Telugu Gateway
Telugugateway Exclusives

టాలీవుడ్ టాప్ హీరోల ఫ్యాన్స్ పై పవన్ కన్ను!

టాలీవుడ్ టాప్ హీరోల ఫ్యాన్స్ పై పవన్ కన్ను!
X

టాలీవుడ్ లో ప్రముఖ హీరో గా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ల విషయానికి వస్తే తన పని తాను చేసుకుపోతారు. మిగిలిన హీరోల విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకొనే సంధర్బాలు అరుదు అనే చెప్పాలి. రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడు ఆయన వైసీపీ టార్గెట్ గా దూకుడు చూపిస్తున్నారు. వారాహిపై అయన ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ యాత్ర చేస్తూ తొలిసారి తన ప్రసంగంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోల పేర్లు ప్రస్తావించటం హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా చేయటం ఇదే మొదటిసారి. గతంలో అయన ఎప్పుడూ టాలీవుడ్ హీరో ల పేర్లు రాజకీయ సమావేశాల్లో ప్రస్తావించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అలాంటిది ఈ సారి వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తాను ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు చూస్తానని ...తనకు వాళ్ళు అంటే ఎంతో అభిమానం అంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవి, రామ్ చరణ్ అంటే సొంత కుటుంబ సభ్యులు. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ నోట ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ తో పాటు ఇతర టాప్ హీరోలు అన్నా తనకు గౌరవం అంటూ మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు సినిమా అభిమానాలు, కులాల అభిమానాలు పక్కన పెట్టి నిర్ణయం తీసుకోవాలని..లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ ను ఎవరూ కాపాడలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక్క తన ఫ్యాన్స్ నే కాకుండా ఇలా అందరి హీరోల పేర్లు ప్రస్తావించటం ద్వారా వాళ్ళను కూడా తన వైపు తిప్పుకునే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోని కీలక హీరో ల పేర్లు చెపుతున్నా కూడా ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి ఎవరూ బయటికి వచ్చి ప్రకటనలు చేసే పరిస్థితి ఉండదు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు. ఎక్కదవరకో ఎందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తాను ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల విషయంలో తటస్థంగా ఉంటానని కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. అంతకు ముందు తన తమ్ముడికి కాకుండా మరొకరికి తన మద్దదు ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. ఇలా చిరంజీవే తన సొంత తమ్ముడి విషయంలో ఊగిసలాట ధోరణి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సారి నేరుగా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరి ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయి అన్నది ఎన్నికల తర్వాత కానీ తేలదు. అయితే పవన్ కళ్యాణ్ నేరుగా కీలక హీరో ల పేర్లు ప్రస్తావించి మాట్లాడటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉండటం ఖాయం అనే అభిప్రాయం కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it