Telugu Gateway
Telugugateway Exclusives

జగన్ సర్కారు వింత పొకడ

జగన్ సర్కారు వింత పొకడ
X

మీ విమర్శలకు మా యాడ్స్ సమాధానం చెబుతాయ్

ఆర్ధిక సంక్షోభంలోనూ జాకెట్ యాడ్స్ థమాకా

యాడ్ లోనూ ప్రశ్న వేరు..సమాధానం వేరు

తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతామన్నారుగా?

ఇసుక విషయంలో మౌనం ఎందుకో?

పరీక్ష పేపర్ దిద్దే వారు వేరే వాళ్ళు అయితే సమాధానాలు రాసేవారు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరో అడిగిన ప్రశ్నను తామే వేసుకుని..తమకు తోచిన సమాధానం రాసుకుంటే ఇక అసలు చిక్కే ఉండదు. అలాగే ఉంది జగన్ సర్కారు తీరు. అది కూడా తోచిన సమాధానం రాసుకోవటానికి సర్కారు ఖజానా నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేయటం. ఆ పేపర్ దిద్దేది కాదు కాబట్టి ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాసుకున్నా ఓకే అన్నట్లు ఇష్టానుసారం రాసేసుకున్నారు ఏపీ సర్కారు వారు. 'నష్టాల్లో ఉన్న సంస్థకు అప్పగింత అట' అన్నది విషప్రచారం అని..దీనికి నిఖార్సైన నిజం ఇది అంటూ ఏదేదో రాసుకున్నారు. అసలు ఆ సంస్థ నష్టాల్లో ఉందా? లేక ఆర్ధికంగా బలోపేతంగా ఉందా అన్న సంగతి వదిలేసి..మిగతా అన్ని విషయాలు నిఖార్సైన నిజాలు కింద ప్రస్తావించారు. అదేంటి అంటే సంబంధం లేని టర్నోవర్ లెక్కలు..120 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి వంటి అంశాలు రాసుకొచ్చారు.

ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చిన యాడ్ లో వేసిన ఈ ప్రశ్నకు అసలు సమాధానానికి పొంతనే లేదు. అంతే కాదు ఆ యాడ్ లో ఇక సులభతరంగా..రాజకీయ ప్రమేయం..దళారుల బెడద లేకుండా వినియోగదారులకు ఇసుక అందుబాటులో ఉంటుందని ఘనంగా ప్రకటించారు. అంటే ఏపీఎండీసీ సరఫరా చేసినా ఇఫ్పటివరకూ రాజకీయ నాయకులు..దళారుల ప్రమేయం ఉందని ప్రభుత్వం అంగీకరిస్తుందా?. ఇక నుంచి ఉండదు అంటే ఇప్పటివరకూ ఉన్నట్లే కదా?. ఇసుక టెండర్లకు సంబంధించిన తీసుకున్న నిర్ణయంపై విపక్షాల విమర్శ లకు గనుల శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. టెండర్లలో అభ్యంతరాలు, అనుమానులు వ్యక్తం చేసిన వారిని మీరు ఎందుకు టెండర్లు వేయలేదు అని ప్రశ్నించటం ఓ రాజకీయ నాయకుడి వ్యాఖ్యలా ఉందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

తమ ప్రభుత్వంపై ఎవరైనా తప్పుడు..నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గతంలో ప్రకటించిన జగన్ సర్కారు ఇసుక విషయంలో మాత్రం యాడ్స్ తో సమాధానం చెబుతోంది. అదే సరస్వతి పవర్ లీజుల పొడిగింపు తదితర అంశాలపై చంద్రబాబు, ఇతరుల చేసిన విమర్శలకు మాత్రం లీగల్ నోటీసులు ఇచ్చారు. ఈ సారి అందుకు భిన్నంగా ఎందుకు వ్యహరిస్తున్నారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇసుక విధానంపై వచ్చిన విమర్శలకు సంబంధించి ఇవాళ ఏపీలో ఏ పేపర్ చూసినా ఫుల్ పేజీ జాకెట్ యాడ్స్ పండగే. ఓ వైపు రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఈ తరుణంలో విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు యాడ్స్ ఇవ్వటంపై అధికార వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సహజంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేస్తే అధికారులు వివరణ ఇస్తారు..తర్వాత అధికార పార్టీ కూడా పార్టీపరంగా స్పందిస్తుంది. కానీ ప్రతిపక్షాల విమర్శలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యాడ్స్ ద్వరా సమాధానం చెబుతున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్కారే. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ నూతన ఇసుక విధానంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story
Share it