Telugu Gateway
Telugugateway Exclusives

న‌డ్డా నోట రాని ప‌వ‌న్ మాట‌!

న‌డ్డా నోట రాని ప‌వ‌న్ మాట‌!
X

బిజెపి జాతీయ అధ్య‌క్షుడు జెపీ న‌డ్డా రెండు రోజుల ఏపీ ప‌ర్య‌ట‌న ముగిసింది. ఆయ‌న పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అవటంతో పాటు మంగ‌ళ‌వారం నాడు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో బ‌హిరంగ స‌భ‌లో కూడా మాట్లాడారు. కానీ ఈ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఎక్క‌డా న‌డ్డా నోట జ‌న‌సేన గురించి కానీ..ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు కూడా ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఏపీలో బిజెపి-జ‌న‌సేన‌ల మ‌ధ్య ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవలే ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌హిరంగంగా మాట్లాడుతూ త‌న‌కు రాష్ట్ర నేత‌లు ఎవ‌రూ పెద్ద‌గా తెలియ‌ద‌ని..త‌న సంబంధాలు అన్నీ జాతీయ స్థాయి నేత‌ల‌తోనే అని వ్యాఖ్యానించారు. సీన్ క‌ట్ చేస్తే రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వచ్చిన బిజెపి జాతీయ అధ్య‌క్షుడు ఎక్క‌డా మ‌ర్యాద‌పూర్వ‌కంగా కూడా త‌మ భాగ‌స్వామి పార్టీని..ఆ పార్టీ అధినేత గురించి ప్ర‌స్తావించ‌కుండా వెళ్లారు. బ‌హిరంగ‌లో స‌భ‌లో మాత్రం ఆయ‌న వైసీపీ పోవాలి--బిజెపి రావాలి అన్న నినాదం ఎత్తుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్లు అన్నీ క‌మ‌లం గుర్తుపైనే ప‌డాల‌న్నారు.

ప‌నిలో ప‌నిగా ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఇవన్నీ కూడా ఉత్తుత్తి విమర్శలే అన్న సంగతి గత కొంత కాలంగా బిజెపి-వైసీపీల మధ్య సంబంధాలను చూస్తున్న వారెవరికైనా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు అసలు ఏపీలో బిజెపి అధికారంలోకి రావటం సంగతి అలా ఉంచితే సొంతంగా పోటీ చేస్తే ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు కూడా వచ్చే పరిస్థితి లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో బిజెపి కంటే రాజకీయంగా బలంగా ఉన్న జనసేనను, ఆ పార్టీ అధినేతను ఏ మాత్రం పట్టించుకోకపోవటం అన్నది చర్చనీయాంశంగా మారింది. మరో కీలక అంశం ఏమిటంటే నడ్డా పర్యటనకు ముందే జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ బిజెపి-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర స్థాయి నాయకులే తిరస్కరించగా..నడ్డా మాత్రం అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇది జనసేనకు అవమానమే అన్న చర్చ సాగుతోంది.

Next Story
Share it