అవమానమే..అయినా అనివార్యం!
తాజాగా దేశంలో అగ్రశ్రేణి ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చి 2024 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానానికి రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి..ఎక్కడెక్కడ ఒంటరిగా పోటీచేయాలో చెప్పటంతోపాటు లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లను కూడా టార్గెట్ చేసుకోవాలో నెంబర్లతో సహా లెక్కలు ఇచ్చారు. గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ సారి ప్రశాంత్ కిషోర్ నివేదికపై ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆగమేఘాల నివేదిక తెప్పించుకుంది. నిర్ణయాలు తీసుకుంటుంది కూడా. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇక లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఆ పార్టీ నేతల నుంచి.
అంతా సాఫీగా సాగి..ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత త్వరలో జరగనున్న గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సానుకూల పలితాలు సాధిస్తే మాత్రం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు జోష్ వస్తుందనటంలో సందేహం లేదు. నిజానికి ఇప్పుడు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గుజరాత్ విషయానికి వస్తే బిజెపి సుదీర్ఘకాలం అక్కడ అధికారంలో ఉండటంతో ఆ పార్టీపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేతక వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటే అక్కడ కూడా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గతంలో బిజెపికి సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్ కు ఆ పార్టీ ఎత్తులు..పైఎత్తులు తెలిసినందున కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ పునర్జీవ బాధ్యతలు తీసుకుంటే మాత్రం పోటీ రంజుగా మారటం ఖాయం అంటున్నారు.