Telugu Gateway
Telugugateway Exclusives

ఆస్కార్ స్థాయి నిజంగా అంతేనా?

ఆస్కార్ స్థాయి నిజంగా అంతేనా?
X

(సుంకర వెంకటేశ్వర రావు) న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సంస్థ కూడా ఇక్కడ భారతదేశంలో వ్యాపార ప్రాయోజిత వాణిజ్య ప్రకటనలతోనూ అవార్డులు అమ్ముకోవడం ద్వారానూ ఫిలింఫేర్ సంస్థ లాంటి అవార్డులు అమ్ముకునే అంతర్జాతీయ సంస్థేనా?. పై రెండు ప్రశ్నలకు నా అంతరాత్మ, నా పరిణతి, నా జ్ఞానం మాత్రం అంతేనని చెబుతున్నాయి...ఇది పూర్తిగా నా వ్యక్తిగతం మాత్రమే. త్రిబుల్ ఆర్(RRR) అనే తెలుగు సినిమాను ఆస్కార్ కి నామినేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు చదువుతున్నాము.అలాగే, న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అనే సంస్థ 1935 లో అమెరికాలో స్థాపించబడింది, ఆ సంస్థ కూడా త్రిబుల్ ఆర్(RRR)సినిమా దర్శకుడికి కితాబులు ఇస్తూ ఆ సినిమాలో దర్శకుడు రాజమౌళి ప్రతిభను గుర్తిస్తూ అవార్డుని కూడా ప్రకటించింది. నిజంగానే ఆ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయ్యే అంత సత్తా స్థాయి ఉన్న సినిమానా?. అందులో ఏ అంశం ఆ సినిమాని ఆ స్థాయికి తీసుకెళ్లిందో నాకైతే అర్ధంకాలేదు, నేను కూడా ఆ సినిమాను అతికష్టంమీద పూర్తిగా చూసాను, నాకైతే ఆ సినిమాలో ఏఒక్క అంశము ఆకట్టుకోలేకపోయింది, బాహుబలితో పోల్చడానికి కూడా వీలులేని సినిమాగా నాకు అనిపించింది. బాహుబలి సినిమానే కేవలం గ్రాఫిక్స్ వలన ఆకట్టుకున్నదే తప్పించి మరేమీకాదు, బాహుబలి సినిమాలో కావాల్సినన్ని లెక్కపెట్టలేనన్ని తప్పులు ఉన్నాయి, ఆ సినిమా ప్రతిభ పూర్తిగా కేవలం కెమెరామెన్ సంగీతదర్శకుడు యొక్క ప్రతిభ మాత్రమేనని, ఆకీర్తి వాళ్ళకే దక్కాలని నాకు అనిపిస్తుంది. ఆ సినిమాలో కధ దర్శకత్వంలో ఏమాత్రం ఆశ్చర్యం కలిగించే విస్తుపోయే కొత్తదనంగానీ సృజనాత్మకతగానీ మానవ మేధస్సుని వికసింపచేసే అంశాలుగానీ ఏమీలేవు, కేవలం కాసేపు వినోదం మాత్రమే.

అలాంటి బాహుబలి సినిమాతో ఏమాత్రం సరితూగని త్రిబుల్ ఆర్ సినిమాకు ఇన్ని కితాబులు మరియు ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవకాశాలు రావడం వెనక పూర్తిగా గొప్ప కమర్షియల్ కొర్పొరేట్ మార్కెటింగ్ వ్యూహంగానీ, పూర్తిగా ఖరీదైన కొర్పొరేట్ లాబీయింగ్ గానీ, లేక ఎదో "రాజకీయ అదృశ్య హస్తాలు" తప్పకుండా ఉన్నాయనేది నా నిశ్చితాభిప్రాయం. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నేటివరకు వచ్చిన అన్ని సినిమాలకు నేను వ్యక్తిగతంగా కేవలం పాస్ మార్కులు (నూటికి ముప్పై ఐదు నుండి యాభై వరకూ) లేదా కొద్దిగా ఎక్కువ మాత్రమే ఇవ్వగలను. ఎందుకంటే అతని అన్ని సినిమాల్లో హింసాత్మక దృశ్యాలు చూపించేటప్పుడు జుగుప్సాకరంగా చూపిస్తూ అతని మానసిక భావాలను తద్వారా వ్యక్తంచేయడం, హీరోలు డైలాగులు మాట్లాడేటప్పుడు విపరీతంగా అసందర్భంగా అరవడం కేకలు వేయడం లాంటి విపరీత వింతపోకడలుతో అతనిలో బలవంతంగా అణచిపెట్టుకున్న క్రోధాన్ని అసహనాన్ని విపరీతమనస్తత్వాన్ని ఆవిష్కరిస్తుంటాయి. ఇవి ఏవీ కూడా నిజంగా ఒక సినిమాను ఆస్కార్ స్థాయిలో నిలబెట్టేవి కానేకాదు, నిజంగా అయితే అతని సినిమాలు ఇక్కడ మన రాష్ట్రస్థాయిలొనే నిజాయితీగా నిబద్ధతతో చేసే విమర్శనాత్మకతకు నిలబడేవి కానేకావు.

అతని సినిమాల ప్రచారంలో అతని వెనక ఏదో ఒక బలమైన మార్కెటింగ్ బృందంగానీ సంస్థగానీ ఉండిఉండొచ్చని నా అభిప్రాయం. పైన పేర్కొన్న రెండు సంస్థలు (ఆస్కార్ మరియు న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్) ఇక్కడ రవీంద్రభారతిలో త్యాగరాయగానసభలో తెలుగు లలితకళాతోరణం ఆడిటోరియంలో కిరాయికి అవార్డులు సన్మానాలు చేసే స్థానిక సాంస్కృతిక సంస్థలు లాగానే కనిపిస్తున్నాయి. లేదా....నేను ఈ సమాజంలో పరిణతి జ్ఞానంలేని, సినిమాలు చూడడంరాని, సినిమాలు ఎలా చూడాలో తెలియని మూర్ఖుడిని అవివేకిని అయ్యుండాలి. ఏదేమైనా...ఈ సభ్యసమాజంలో నాలాంటివాళ్ళు ఇంకెందరో.!? నేను నా అభిప్రాయాలను వ్యక్తంచేసినందుకు నామీద పలు ఆరోపణలు పలుదాడులు జరుగుతాయని నాకు తెలుసు, అందుకు నేను సిద్ధమే, నామాటకు నా అభిప్రాయాలకు నేను ఎప్పుడూ కట్టుబడే ఉంటాను.

భవదీయుడు.

~సువేరా.

Next Story
Share it