Telugu Gateway
Telugugateway Exclusives

మోడీ మనసు కరుగుతుందా...వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగుతుందా?

మోడీ మనసు కరుగుతుందా...వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగుతుందా?
X

వంద రోజులు దాటిన రైతు ఉద్యమాన్ని కూడా పట్టించుకోని వైనం

జగన్ లేఖ తర్వాత కూడా మరింత ఘాటు స్పందనలు

సహజంగా ఏ రాజకీయ పార్టీ కూడా రైతులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి సాహసించదు. కానీ బిజెపి మాత్రం అందుకు భిన్నంగా వెళుతుందనే చెప్పొచ్చు. కేంద్రం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలపై వంద రోజులకుపైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కొన్ని రైతు సంఘాలు పిలుపునిస్తున్నాయి కూడా. అయినా సరే కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. అత్యంత సున్నితమైన రైతుల అంశంలో బిజెపి తీరు చూసి కొంత మంది సొంత పార్టీ నేతలతోపాటు దేశంలోని ప్రధాన పార్టీలు అన్నీ కూడా విస్మయానికి గురవుతున్నాయి. దీనికంతటికీ కారణం కేంద్రంలో బిజెపికి ఉన్న అప్రతిహతమైన మెజారిటీ ఒకెత్తు అయితే...మరొకటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాష్ట్రాల్లోని సర్కార్లు మోడీకి అనధికారికంగా సరెండర్ కావటం మరొకటి. ఎవరైనా మాట్లాడినా మొక్కుబడి ప్రకటనలే తప్ప..పోరాటస్పూర్తి చూపే వారు లేరనే చెప్పొచ్చు.

ఏపీ విషయానికి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న అంశం. అంతే కాదు ఏపీకి ఇది ఎంతో కీలకం కూడా. దేశ వ్యాప్తంగా అంటే కేవలం ఐదారు రాష్ట్రాల్లోనే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బహిరంగ ఉద్యమాలు ఉండొచ్చు...ఇంతటి కీలకమైన సమస్య విషయంలోనే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మొండిగా ఉన్న ప్రధాని మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేసే ఉద్యమాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రాసే లేఖలను పరిగణనలోకి తీసుకుని తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా?. అంటే నో ఛాన్స్ అంటున్నాయి అధికార వర్గాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత పలు ప్రత్యామ్నాయాలు సూచిస్తూ లేఖ రాశారు. ఈ లేఖ రాసిన తర్వాతే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణ చేసి తీరతామని ప్రకటించారు.

దీనికి కొనసాగింపుగా ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని. కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోతే..ప్లాంట్ మూసేస్తామని ప్రకటించి మరింత కలకలం రేపారు. ఇది అంతా ఏపీలో అన్ని పార్టీలు కలసి ఉద్యమం చేస్తామని చెప్పుకుంటున్న తరుణంలో జరుగుతున్న పరిణామాలే. వీటిని కేంద్రం ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు కన్పించటం లేదు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం సాధించుకోవాల్సిన హక్కుల విషయంలోనే ఏపీకి చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కేంద్రం నుంచి సానుకూల ఫలితాలు రాబట్టుకోవటంలో విఫలమవుతోంది.

ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలుకుని ఓ భారీ ఓడరేవు, కడప స్టీల్, రైల్వే జోన్ వంటివి ఎన్నోఅంశాలు ఉన్నాయి. మరి ఈ తరుణంలో కేంద్రంలోని మోడీ సర్కారును ఢీకొట్టి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటారా?. అంటే వేచిచూడాల్సిందే. అదేమంటే కొంత మంది మంత్రులు రాష్ట్ర ప్రభుత్వమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బిడ్ వేస్తుందని ప్రకటిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన భారీ ఓడరేవు కేంద్రం చేయటం లేదని..దాన్ని మైనర్ పోర్టుగా మార్చి మేమే చేసుకుంటాం అని ప్రకటించి...జీవోలు ఇచ్చేశారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రం చేయటం లేదు కాబట్టి మేమే కట్టుకుంటాం అంటూ పని ప్రారంభించారు. మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఏపీ సర్కారే కొనుగోలు చేస్తుంది అంటే దాని అర్ధమేంటి?. చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను వదిలేసుకుంటున్న విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it