ఇంట్రెస్టింగ్ ఫోటో..గ్యాప్ అలాగే ఉన్నట్లు ఉంది?!
ఈ ఫోటో ఒక్కసారి చూడండి. గవర్నర్ తమిళ్ సై..తెలంగాణ హైకోర్టు నూతన సీజెగా ప్రమాణ స్వీకారం చేసిన ఉజ్జల్ భుయాన్. వీరిద్దరూ చాలా దగ్గరగా కూర్చున్నారు. అంటే ఒకరు మాట్లాడితే మరొకరికి విన్పించేంత సమీపంలోనే ఉన్నారు. కానీ సీఎం కెసీఆర్ కుర్చీ మాత్రం వీరిద్దరికి దూరంలో ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. గవర్నర్ తమిళ్ సై..సీఎం కెసీఆర్ ల మధ్య దూరాన్ని సింబాలిక్ గా చూపించేందుకే ఇలా సీటింగ్ ఏర్పాట్లు చేశారా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఒక వేళ కొవిడ్ ప్రోటోకాల్ లో భాగంగా అలా చేశారు అనుకున్నా కూడా గవర్నర్, సీజెల మధ్య సీట్ల దూరం తక్కువగానే ఉన్న విషయం పోటోలో స్పష్టం అవుతోంది.
గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ తమిళ్ సై పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. రాజ్ భవన్ ను రాజకీయ వేదికగా మార్చారని.. అసలు గవర్నర్ ఎలా ప్రజాదర్బార్ పెడతారంటూ పార్టీ నేతలు మండిపడ్డారు. గవర్నర్ తమిళ్ సై సైతం ఏ మాత్రం తగ్గకుండా ప్రజలతో మాట్లాడకుండా తననూ ఎవరూ ఆపలేరని..తాను ఏమీ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించటం లేదంటూ స్పష్టం చేశారు. ఇటీవల జూబ్లిహిల్స్ ప్రాంతంలో జరిగిన మైనర్ బాలిక రేప్ కేసును గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం నుంచి నివేదిక కోరినా కూడా స్పందించలేదంటూ ఆమె ప్రజాదర్భార్ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.