Telugu Gateway
Telugugateway Exclusives

ప్రపంచంతో భారత్ ప్రయాణ సంబంధాలు కట్!

ప్రపంచంతో భారత్ ప్రయాణ సంబంధాలు కట్!
X

ప్రపంచ దేశాలు అన్నీ ఇప్పుడు భారత్ అంటే భయపడుతున్నాయి. అందుకే వరస పెట్టి నిషేధాలు విధిస్తున్నాయి. వ్యాపారులు..విద్యార్ధులు..పర్యాటకులు ఇలా ఒకరేమిటి అందరికీ దారులూ మూసుకుపోయాయి. గత కొన్ని నెలలుగా దేశంలో విభృంబిస్తున్న కరోనా రెండవ దశ వైరస్ కేసులతో కీలక దేశాలు అన్నీ భారత్ నుంచి వచ్చే విమానాలకు ఎర్ర జెండా చూపించాయి. ఒక్కొక్కటిగా దేశాలు అన్నీ భారత్ పై నిషేధం విధిస్తూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మాల్దీవులు చేరిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాల్దీవులు భారత విమానాలను నిషేధించింది. కువైట్ కూడా ఏప్రిల్ 24 నుంచి బ్యాన్ పెట్టింది. ఇటలీ అయితే భారత్ నుంచి వచ్చే వారితో పాటు గత 14 రోజుల వ్యవధిలో భారత్ లో పర్యటించిన వారు కూడా దేశంలోకి రావటానికి వీల్లేదని ఆంక్షలు అమలు చేస్తోంది. ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి వచ్చే విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని ప్రకటించిది. కెనడా ఏకంగా 30 రోజుల పాటు భారత విమానాలను సస్పెండ్ చేసింది. యూఈఏ కూడా ఇదే బాటలోనే పయనించింది. అందరి కంటే ముందు న్యూజిలాండ్ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. యూకె, ఆస్ట్రేలియాలు కూడా నిషేధం బాట పట్టాయి. అమెరికా అయితే తమ పౌరులు ఎవరూ భారత్ కు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేయటంతో పాటు..తాజాగా బారత్ లో ఉన్న వారు కూడా తక్షణమే అక్కడ నుంచి రావాలని కోరింది.

పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా సరైన వైద్య సదుపాయాలు కూడా అందే అవకాశం భారత్ లో లేదని ఆందోళన వ్యక్తం చేసింది. హాంకాంగ్ కూడా భారత్ విమానాలకు నో చెప్పింది. సింగపూర్ వెళ్లినా అక్కడ 14 రోజులు ఎంపిక చేసి ప్రాంతంలో క్వారంటైన్ లో ఉండాలి..మరో ఏడు రోజులు కూడా హో మ్ క్వారంటైన్ లో ఉండాలనే నిబంధనలు పెట్టింది. ప్రస్తుతం దీర్ఘకాలిక వీసాలపై పర్యాటకులను అనుమతిస్తున్న థాయ్ ల్యాండ్ కూడా భారత్ నుంచి పర్యాటకులను అనుమతించబోమని ప్రకటిచింది. ఈ నిషేధాలు తాత్కాలికమే అయినా..భారత్ ప్రస్తుతం ప్రపంచంతో ప్రయాణ సంబంధాలు కోల్పోయిందనే చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రయాణ నిషేధాలు వల్ల ఎన్నో ఇబ్బందులు పడనున్నారు. దేశంలో ఎప్పుడు కరోనా రెండవ దశ కేసులు తగ్గుతాయి..ఎప్పుడు ఈ ఆంక్షలు ఎప్పుడు తొలగుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి.

Next Story
Share it