ఈడీ..మోడీ అంటే చాలు టీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలుస్తుందా?!
ఈ ఫోటో చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి ఖరారు సమయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నందునే తాము ఈ సమావేశానికి హాజరు కాలేదని టీఆర్ఎస్ నేతలు అప్పట్లో కలరింగ్ ఇచ్చారు. తర్వాత యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఇది అంతా పాత కథే. అయితే గురువారం నాడు ఢిల్లీలో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికికి కాంగ్రెస్ పార్టీనే సారధ్యం వహించినట్లు ఈ ఫోటో చూస్తేనే అర్ధం అవుతుంది. కీలక స్థానాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేష్, ఎక్కువ శాతం కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ లోక్ సభా, రాజ్యసభ పార్టీ నాయకులు కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొనటమే కాకుండా మీడియాకు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో సంతకం కూడా చేశారు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.
మోడీ, ఈడీ అంటే చాలు కాంగ్రెస్ తో అయినా సరే జోడీ కట్టడానికి టీఆర్ఎస్ రెడీ అయిపోయిందన్న మాట. అంతే కాదు..టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే చాలు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు...ఇతర నాయకులు అందరినీ ఇంటి నుంచి బయటకు రానిచ్చేవారు కాదు. హౌస్ అరెస్ట్ లు జరిగేవి. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలిచినప్పుడు, ఇప్పుడు సోనియాగాంధీని విచారణకు పిలిచినప్పుడు ఈడీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుమతి ఇస్తున్నారు. అంటే టీఆర్ఎస్ వ్యతిరేకంగా అంటే మాత్రం ఇంట్లో నుంచి బయటకు రానివ్వరు..అదే మోడీ, ఈడీకి వ్యతిరేకంగా అంటే చాలు..చేసుకోండి అంటూ అనుమతులు ఇచ్చేస్తున్నారు. భవిష్యత్ లో తమకు ఏమైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారనే ఇలా పరస్పరం సహరించుకుంటున్నారని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.రెండు పార్టీలకు సమాన దూరం అంటూ చెప్పుకొచ్చిన టీఆర్ఎస్ వైఖరిలో ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏమిటి?.