ఏమి తెలియకుండానే కృష్ణ ఎల్లా వాటర్ బాటిల్ ధర చెప్పారా?.
వ్యాక్సిన్ ధరపై భారత్ బయోటెక్ వివరణ
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా. వ్యాక్సిన్ తయారీకి ముందే ధరలపై వివరణ ఇచ్చారు. మంచి నీటి బాటిల్ ధర కంటే తక్కవ ధరకే తాము వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. ధరల అంశం ప్రస్తావిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు. కానీ అసలు వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చాక మాత్రం ధరలు అమాంతం మారిపోయాయి. కేంద్రానికి ఓ రేటు..రాష్ట్రాలకు ఓ రేటు..ప్రైవేట్ ఆస్పత్రులకు మరో రేటు అంటూ రకరకాల రేట్లు పెట్టారు. సుప్రీంకోర్టు జోక్యంతో మధ్యలో ఉన్న రాష్ట్రాలు కొనుగోలు చేసే వ్యవహారం కాస్తా పక్కకు పోయింది. ఇక ఇప్పుడు మిగిలింది కేంద్రం..ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రమే. అయితే భారత్ బయోటెక్ తాజాగా తన వ్యాక్సిన్ ధరలకు సంబంధించి వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ తయారీలో ఎన్నో సంక్లిష్టతలు ఉంటాయని..ఎన్నో దశలు ఉంటాయని..రవాణా ఖర్చులతో పాటు ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కేంద్రానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం 150 రూపాయలకే అందిస్తున్నామని భారత్ బయోటక్ వెల్లడించింది. ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయలేమని పేర్కొంది. అలాగే తమ ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువవే ప్రైవేట్ ఆస్పత్రులకు, మిగిలిన వాటిని రాష్ట్రానికి, కేంద్రానికి సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ తేల్చి చెప్పింది. నష్టాలను పూడ్చుకునేందుకే ప్రైవేటులో ఈ ధరలను అమలు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది. ప్రైవేట్‌లోఎట్టిపరిస్థితుల్లోనూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలను తగ్గించలేమని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక విఢుదల చేసింది. తమకు నష్టాలొస్తున్నప్పటికీ, ఇప్పటికే తక్కువ ధరకే కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని చెప్పింది.
వ్యాక్సిన్ ధరలను నిర్ణయించటంలో ముడి పదార్ధాలతోపాటు తయారీ కేంద్రాల్లో సౌకర్యాల వంటి ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయన్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ తయారీ ఎంతో క్లిష్టమైనది కాబట్టే చాలా కంపెనీలు ముందుకు రావన్నారు. వ్యాక్సిన్ తయారీ అత్యంత క్లిష్టమైన వ్యవహారం అని, తక్కువ ధర నష్టాలు వస్తాయని తెలియకుండానే కృష్ణ ఎల్లా వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారా?. ఎవరో సంబంధం లేని బయటి వ్యక్తులు మాట్లాడితే వాళ్ళకు విషయం ఏమీ తెలియదు అనుకోవచ్చు. ఇప్పటికే ఈ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ..వ్యాక్సిన్ల తయారీలో ఎంతో పేరున్న సంస్థ సీఎండీ అంత ఆషామాషీగా ప్రకటన చేస్తారా?. నిజంగానే అలా చేశారంటే ఎవరైనా నమ్ముతారా?. అప్పుడు అలా మాట్లాడి..ఇప్పుడు ధరలపై వివరణ ఇస్తే జనం నమ్ముతారా?.అందరి కంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పి..ఎవరూ పెట్టనంత ధర పెట్టింది కూడా భారత్ బయోటెక్ కావటం మరో విశేషం.