ఎంత మంట ఉంటే 'ఆ మంటలు మర్చిపోతారు'!
ఎవరైనా ఇప్పుడు బిజెపికి ఓటు వేయాలంటే వెంటనే గుర్తొచ్చేది పెట్రోల్, డీజిల్ ధరలే. అదొక్కటే కాదు..గ్యాస్ బండ కూడా రోజురోజుకూ గుదిబండగా మారుతోంది. కరోనా కష్టకాలం అనే అంశాన్ని కూడా వదిలేసి..ఏ మాత్రం కనికరం కూడా లేకుండా కేంద్రంలోని బిజెపి సర్కారు వరస పెట్టి గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ సామాన్యుల దగ్గర నుంచి మధ్యతరగతి వరకూ అందరి నడ్డివిరుస్తోంది. అలాంటిది బిజెపి తరపున పోటీ అంటే సాహసమే. అంతే కాదు..ఆ నియోజకవర్గంలో అసలు బిజెపికి చెప్పుకోదగ్గ క్యాడర్..లీడర్లు కూడా లేరనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి అక్కడ వచ్చిన ఓట్లు కూడా రెండు వేల లోపే. కానీ ఈ సారి మాత్రం బిజెపి హుజూరాబాద్ లో 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరేసింది. అయితే ఇందులో బిజెపి పాత్ర చాలా పరిమితం అయితే..సింహభాగం వాటా ఈటెల రాజేందర్ దే అని చెప్పకతప్పదు. పెట్రో ధరలే కాదు..బిజెపి పై వ్యతిరేకత విషయంలో రైతుల చట్టాలపై తీవ్ర కూడా విమర్శలు ఉన్నాయి. ఓ వైపు సీఎం కెసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోంది అంటూ ఎటాక్ ప్రారంభించారు. హుజూరాబాద్ లో ప్రచారం అంతా తానై నిర్వహించిన హరీష్ రావు ఇవే మాటలు అక్కడి ప్రజల్లో నాటుకుపోయేలా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అవేమీ పని చేయలేదు. అంటే హుజూరాబాద్ ప్రజలకు కేంద్రంలోని బిజెపి సర్కారు పెట్టిన ధరల 'మంట' కంటే టీఆర్ఎస్ సర్కారుపైనే ఎక్కువ మంట ఉన్నట్లు కన్పిస్తోందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఫలితాలు ఇదే విషయాన్ని నిరూపించాయన్నారు. అందుకే ఇప్పుడు హుజూరాబాద్ ఫలితం ఎక్కడ చూసినా ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఏ ఇద్దరు కలసినా ఈ ఫలితం వెనక కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇది ఈటెల రాజేందర్ పై సానుభూతి ఓటా? లేక కెసీఆర్ పాలనపై వ్యతిరేక ఓటా?. ఒకప్పటి ఉద్యమసహచరుడు..గులాబీ జెండా ఓనర్ అన్నందుకు ఈటెలపై టీఆర్ఎస్ అధిష్టానం చేసిన వేధింపులకు ప్రజలు ఇచ్చిన తీర్పా?. హుజూరాబాద్ ఫలితం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార పార్టీ, నేతలు ఉపయోగించని అస్త్రాలు లేవు. చేయని ప్రయత్నం లేదు. అదే సమయంలో ఇన్ని అస్త్రాలను చేధించుకుని..పథకాలు..డబ్బు పంపిణీ వంటి అంశాలను కూడా లైట్ తీసుకుని ఈటెలకు ఈ స్థాయి విజయం అందించారంటే హుజూరాబాద్ తీర్పు తెలంగాణ రాజకీయాలకు ఓ కేస్ స్టడీగా మారబోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సహజంగా భారీ ఎత్తున డబ్బు పంపిణీ జరిగితే ఫలితం ఆ పార్టీకే అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఏపీలో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక కూడా ఇదే విషయాన్ని రుజువు చేసింది. కానీ హుజూరాబాద్ మాత్రం అందుకు భిన్నం. వ్యతిరేకత ఉంటే డబ్బు, పథకాలు..ప్రలోభాలు ఏమీ పనిచేయవని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు. అంతే కాదు అక్కడి ప్రజలు అసలు ఈటెల రాజేందర్ ను ఓ ఉద్యమకారుడిగా చూశారు తప్ప...బిజెపి అభ్యర్ధిగా చూడలేదన్నారు. కేవలం గుర్తుకు..పేరుకు పార్టీ ఉపయోగపడిందని ఓ నేత అభిప్రాయపడ్డారు.