Telugu Gateway
Telugugateway Exclusives

'అరబిందో చేతికే అన్నీ' ..కాకినాడలో ఎందుకలా?

అరబిందో చేతికే అన్నీ ..కాకినాడలో ఎందుకలా?
X

ముందు కెఎస్ఈజెడ్...ఇప్పుడు కాకినాడ పోర్టులో మెజారిటీ వాటా

కేంద్రం ఇఛ్చే బల్క్ డ్రగ్ పార్కు ఆ సంస్థ చేతికేనా?

అధికార వర్గాల విస్మయం

అన్నీ అరబిందో రియాల్టీకే. ఎందుకిలా?. ఎలా సాధ్యం. ఏపీలో జరుగుతున్న పరిణామాలు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్షంలో ఉండగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ ..అధికారంలోకి రాగానే అన్నీ తూచ్ అనేసి జీఎంఆర్ కే ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టును అప్పగించింది. సీన్ కట్ చేస్తే కొద్ది రోజుల వ్యవధిలోనే జీఎంఆర్ చేతిలో ఉన్న కాకినాడ ఎస్ఈజెడ్ లో మెజారిటీ వాటాలు అంటే 51 శాతం వాటాను అరబిందో రియాల్టీ దక్కించుకుంది. రైతుల దగ్గర నుంచి కారుచౌకగా భూములు, ప్రభుత్వం నుంచి ఎన్నో రాయితీలు దక్కించుకున్న జీఎంఆర్ సంస్థ ఎంచక్కా 2600 కోట్ల రూపాయలకు ఈ వాటాను అమ్ముకుని వెళ్లిపోయింది. అరబిందో రియాల్టీ సంస్థ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు అన్న విషయం తెలిసిందే.

అంతే కాదు కేంద్రం ఒక వేళ ఏపీకి బల్క్ డ్రగ్ పార్కు కేటాయిస్తే అది కూడా అరబిందో చేతికే వెళుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే కెఎస్ఈజెడ్ పై కన్నేశారని చెబుతున్నారు. ఈ పార్కు రాష్ట్రానికి వస్తే మౌలికసదుపాయాల కల్పన కోసం కేంద్రం వెయ్యి కోట్ల రూపాయాల మేర కేటాయించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఏపీ సర్కారు గురువారం నాడు ఓ జీవో జారీ చేసింది. కాకినాడలోని కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ (కెఎస్ పీఎల్)లో అరబిందో రియాల్టీకి 41.12 శాతం వాటా బదిలీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రైవేట్ డీల్ అయినా ప్రభుత్వ అనుమతి అవసరం. అయినా ఇందులో కొన్ని అదృశ్యశక్తుల పాత్రలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కెఎస్ పీఎల్ లో ఇప్పుడు అరబిందో రియాల్టీ అతి పెద్ద వాటాదారుగా అవతరించింది.

ఓ వైపు జగన్ అదికారంలోకి వచ్చాక మౌలికసదుపాయాల శాఖ కాకినాడ పోర్టు ఖాతాల వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ఆదేశించింది. . కానీ అది ఏమైందో తెలియదు . అయితే ఇప్పుడు అరబిందో రియాల్టీ మాత్రం మెజారిటీ వాటాదారుగా అవతరించింది. అంటే ఏపీలో పారిశ్రామికంగా అత్యంత కీలకమైన కాకినాడ ప్రాంతంలో కొద్ది నెలల వ్యవధిలోనే కెఎస్ఈజెడ్ లో మెజారిటీ వాటా, కాకినాడ పోర్టులో మెజారిటీ వాటా అరబిందో రియాల్టీ చేతికి రావటం అన్నది అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని వెనక ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయని..లేకపోతే ఇది సాధ్యం కాదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హయాంలో టెండర్లు అన్నీ ఒకే కంపెనీకి పోతున్నాయని ఆరోపించిన నేతలు..ఇప్పుడు వేల కోట్ల రూపాయాల ప్రాజెక్టులను ఒకే కంపెనీ చేతికి దక్కేలా చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ లెక్కన కొత్తగా చేపట్టనున్న మచిలీపట్నం ఓడరేవులో కూడా అరబిందో రియాల్టీ భాగస్వామిగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆల్రెడీ ఓ ఓడరేవు నిర్వహణ అనుభవం వచ్చినట్లు అయిపోయింది ఈ సంస్థ. ఇది చూపి మచిలీపట్నం పోర్టు టెండర్లలో పాల్గొనేందుకు ఇది అర్హత సాధించే అవకాశం దక్కించుకున్నట్లు అయిందని ఓ అధికారి తెలిపారు.

Next Story
Share it