హిమాన్షూ...ముందు నారా లోకేష్ కూడా ఇలాగే చెప్పాడు!
ఫస్ట్ అందరూ ఇలాగే చెబుతారు. అబ్బే రాజకీయాలు అంటే మాకు అసలు ఆసక్తే లేదు. మా టార్గెట్స్ వేరు..మేం చేయాల్సినవి వేరు. కానీ చివరి నిమిషంలో రాష్ట్ర రక్షణకు అనో..పార్టీ సంరక్షణ కోసమే అని చెప్పి ఎంట్రీ ఇస్తారు. అయినా ఇప్పుడు కెసీఆర్ ఫ్యామిలీలో తక్కువ మంది ఉన్నారా రాజకీయాల్లో. కెసీఆర్ ముఖ్యమంత్రి, కెటీఆర్ మంత్రి, కెసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ. ఆయన కుటుంబానికి చెందిన హరీష్ రావు మరో మంత్రి...సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు. అసలు హిమాన్షురావుకు రాజకీయాల్లోకి వచ్చే వయస్సు వచ్చిందా?. ఆయన వయస్సు ప్రస్తుతం 16 సంవత్సరాలు. అసలు ఓటింగ్ హక్కు రావటానికే ఇంకా రెండేళ్ళ సమయం ఉంది. మరి ఇప్పుడే ట్విట్టర్ లో హిమాన్షు ఈ రాజకీయ ప్రకటన ఎందుకు చేసినట్లు?. దీని కంటే ముందు హిమాన్షు మరో ట్వీట్ చేశాడు. అదేంటి అంటే తన పుట్టిన రోజు నాడు బొకేలు పంపటం కాకుండా ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కెసీఆర్ పుట్టిన రోజున..మళ్లీ ఇప్పడు కెటీఆర్ పుట్టిన రోజున మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు వీళ్లు హారితహారం ప్రారంభం నాటి నుంచి చెబుతున్న మొక్కల లెక్కలు అన్నీ తీస్తే తెలంగాణ రాష్ట్రంలో మనుషుల కంటే మొక్కలే ఎక్కువ ఉండాలి.
ఇది వేరే వ్యవహారం. రాజకీయ నేతలు..వారి వారసులు ఏదైనా ప్రకటన చేశారు అంటే ఖచ్చితంగా అందుకు భిన్నంగా జరుతుందని నిర్ధారించుకోవచ్చు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ విషయంలోనూ అదే జరిగింది. తొలి రోజుల్లో నారా లోకేష్ కూడా తనకు రాజకీయాల మీద ఆసక్తిలేదనే చెప్పాడు. అంతే కాదు నారా లోకేష్ పొలిటికల్ ఎంట్రీపై అప్పట్లో చంద్రబాబు కూడా లోకేష్ కు రాజకీయాలా ..నో నో అని చెప్పాడు. చివరకు ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రి పదవి ఇచ్చారు. ఈ లెక్కన చూస్తే కల్వకుంట్ల హిమాన్షురావు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలేదని ఇంత ముందుగానే ప్రకటించారు అంటే గ్యారంటీగా వస్తా..రెడీగా ఉండండి అని సంకేతం ఇస్తున్నట్లే అని ఓ రాజకీయ నేత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు అంటే ఫ్యామిలీ పార్టీలు అన్న సంగతి ఎప్పటి నుంచో నిరూపితం అవువూనే ఉంది. అవి ఆ ఫ్యామిలీలను దాటి బయటకు రావు..అంతే.