Telugu Gateway
Telugugateway Exclusives

ఖాయిలా కంపెనీలో ఏపీ సర్కారు వాటా కొంటుందా?!

ఖాయిలా కంపెనీలో ఏపీ సర్కారు వాటా కొంటుందా?!
X

జగన్ సర్కారు మెడకు అన్ రాక్ చిక్కులు

నాటి వైఎస్ నిర్ణయంతో నేడు జగన్ సర్కారుకు చిక్కులు

బాక్సైట్ తవ్వలేరు..సరఫరా అంత ఈజీకాదు

ప్రాజెక్టు భారం మొత్తం సర్కారుపై పడనుందా?

ఎవరైనా మంచి లాభాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు కొందామనుకుంటారు?. కానీ ఏపీలో జగన్ సర్కారు ఏంటో అసలు మొదలవుతుందో లేదో తెలియని కంపెనీలో వాటాల కొనుగోలు అంశాన్ని పరిశీలించాలని చూస్తోంది. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో కూడా కలకలం రేపుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకున్నారని విమర్శిస్తున్న సీఎం జగన్ కు తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చేసుకున్న ఒప్పందం పెద్ద చిక్కులే తెచ్చిపెడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అన్ రాక్ అల్యూమినియంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థను పెన్నా ప్రతాఫ్ రెడ్డి, యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ (రాకియా) సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ప్రైవేట్ సంస్థలకు గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ అనుమతులు రావు కాబట్టి అప్పటి వైఎస్ సర్కారు రంగంలోకి ఏపీఎండీసీని దింపి..బాక్సైట్ సరఫరా ఒప్పందం చేయించారు. ఎపీఎండీసీ తో కుదిరిన ఒప్పందం మేరకే విశాఖపట్నలో అల్యూమినియం తయారీ యూనిట్ నిర్మించారు.

కానీ బాక్సైట్ సరఫరాకు సంబంధించి చిక్కులు ఎదురయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబునాయుడు మద్యలో బాక్సైట్ సరఫరాకు రెడీ అయ్యారు. కానీ తీవ్ర విమర్శలు రావటంతో వెనక్కి తగ్గారు. అయితే ఇందులో భాగస్వామిగా ఉన్న రాకియా తాను పెట్టిన పెట్టుబడిని వెనక్కి ఇప్పించాలంటూ అంతర్జాతీయ ఆర్భిట్రేషన్ కు చర్యలు చేపట్టింది. కేంద్రానికి , ఏపీ సర్కారుకు ఈ మేరకు నోటీసులు వచ్చాయి. ఇది ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే కేంద్రం సూచనల మేరకు ఏపీ సర్కారు ఇఫ్పుడు ఈ అంశంపై మరోసారి దృష్టి పెట్టింది. అందులో భాగంగా రాకియాకు చెందిన వాటాను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయటాన్ని కూడా ఏజెండాలో ఓ అంశంగా పెట్టారు. దీంతోపాటు అన్ రాక్ రిఫైనరీ ప్రాజెక్టును నిర్వహణలోకి తీసుకురావటం ఎలా?, ఈ సమస్య పరిష్కారానికి ఉన్న ఇతర ఉన్న ఇతర మార్గాలు ఏమిటి అన్న అంశాన్ని పరిశీలించటానికి ప్రభుత్వం కమిటీ వేసింది. అన్ రాక్ వ్యవహారం ఈ తరుణంలో ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారటం ఖాయం అని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అసలు మొదలవుతుందో లేదో తెలియని కంపెనీలో వాటా తీసుకుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?. కేంద్రం ఈ ప్రాజెక్టుకు బాక్సైట్ సరఫరా అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తుంది?. ఏపీకి రావాల్సిన చట్టబద్ధ అంశాలనే పట్టించుకోని కేంద్రం ఏపీ సర్కారు అడిగిందని బాక్సైట్ సరఫరాకు సహకరిస్తుందా?. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేసి రాకియా కు నష్టపరిహారం చెల్లిస్తే తర్వాత ప్రధాన ప్రమోటర్ గా ఉన్న పెన్నా ప్రతాప్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని నష్టపరిహారం కోరే అవకాశం ఉంటుంది. ఒకే కంపెనీలో ఒకరికి నష్టపరిహారం చెల్లించి..మరొకరికి ఇవ్వం అంటే సాధ్యంకాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అప్పటి వైఎస్ సర్కారు ఖనిజ సరఫరా కు గ్యారంటీ ఇఛ్చాకే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు. దీని కోసం బ్యాంకుల నుంచి దాదాపు 4000 కోట్ల రూపాయల వరకూ రుణాలు తెచ్చారు. ఏది ఏమైనా అన్ రాక్ అల్యూమినియం యూనిట్ జగన్ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారటం ఖాయం అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it