Telugu Gateway
Telugugateway Exclusives

వానొస్తే యాదాద్రి..వ‌ర‌దొస్తే కాళేశ్వరం డొల్ల‌త‌నం తేలింది

వానొస్తే యాదాద్రి..వ‌ర‌దొస్తే కాళేశ్వరం డొల్ల‌త‌నం తేలింది
X

అవి రెండూ తెలంగాణ సీఎం కెసీఆర్ త‌ల‌పెట్టిన ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులు. ఒక దానిపై వంద‌ల కోట్ల రూపాయ‌లు వ్యయం చేశారు. మ‌రో దానిపై చేసిన వ్య‌యం ల‌క్ష కోట్ల రూపాయ‌ల పైమాటే. కానీ ఒక్క భారీ వ‌ర్షం దెబ్బ‌కు వంద‌ల కోట్లు పెట్టి నిర్మించిన యాదాద్రిలో డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డ‌గా...ఓ భారీ వ‌ర‌ద‌కు లక్ష కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించి నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అత్యంత కీల‌క‌మైన మోటార్లు నిండా మునిగాయి. మోటార్లు మున‌గ‌ట‌మే కాదు..ఇవి మున‌గ‌కుండా కాపాడాల్సిన గోడ కూడా కూలింది. ఇప్పుడు కాళేశ్వ‌రంలో న‌ష్టం ఎంతో తేలాలంటేనే ఇంకా చాలా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. అస‌లు కాళేశ్వ‌రం ప్రాజెక్టే ఓ తెల్లఏనుగు అనే విమర్శ‌లు ఉన్నాయి. అయితే వాటిని సీఎం కెసీఆర్ రైతుల కోసం తాను ఎంతైనా ఖ‌ర్చు చేస్తాన‌ని ప్ర‌క‌టిస్తూ ఆ విమ‌ర్శ‌ల‌ను కౌంట‌ర్ చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త‌గా క‌ట్టిన ప్రాజెక్టులో ఒక్క వ‌ర‌ద‌కే మోటార్లు మునిగిపోయాయి అంటే ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు. దీనిపై ఎవ‌రైనా మాట్లాడితే కాంగ్రెస్ హ‌యంలో మోట‌ర్లు మున‌గ‌లేదా అని మంత్రి కెటీఆర్ ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.

అంటే ఇది ఏమైనా ముంచుడు పోటీనా?. ఏ ప్ర‌భుత్వంలో మునిగినా..ఎప్పుడు త‌ప్పు జ‌రిగినా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మ‌రింత ప‌క‌డ్భందీగా ప్ర‌జ‌ల సొమ్మును కాపాడాల్సిన‌, జ‌వాబుదారీత‌నంతో ఉండాల్సిన మంత్రులే కాంగ్రెస్ హ‌యాంలో కూడా మోటార్లు మునిగాయి కాబ‌ట్టి..ఇప్పుడు కాళేశ్వ‌రం మోటార్లు మునిగాయి త‌ప్పేమీలేద‌ని చెబుతారా?. మొత్తం మీద అటు యాదాద్రి విష‌యంలో..ఇటు కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో సీఎం కెసీఆర్ తోపాటు తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్ట‌కు పెద్ద మ‌చ్చ వ‌చ్చింద‌నే అభిప్రాయం అధికార వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇంత కాలం విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ వెళ్ళారు కానీ..ఇప్పుడు చిక్కుల్లో ప‌డిన‌ట్లు అయింద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం కెసీఆర్ కేవ‌లం యాదాద్రిపైనే ఫోక‌స్ పెట్టారు..కావాల‌ని భ‌ద్రాచలాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు రాగా..కొన్ని సంవ‌త్స‌రాల క్రితం వంద కోట్ల రూపాయ‌లు కేటాయిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కూ అది అమ‌లుకు నోచుకోలేదు.

Next Story
Share it