రైతుల చట్టాల రద్దు: టీఆర్ఎస్ మంత్రుల క్రెడిట్ క్లెయిమ్ కామోడీయే
భారత్ బంద్ కు మాత్రం టీఆర్ఎస్ దూరం
మద్దతుగా కనీసం ప్రకటన చేయని వైనం
ఇప్పడు ధాన్యం కొనుగోలుకు ధర్నా చేసి..రైతు చట్టాల రద్దు కెసీఆర్ వల్లే అని ప్రకటనలు
సెప్టెంబర్ 27. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కెఎం) మోడీ సర్కారు తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు పొరుగున ఉన్న ఏపీ సర్కారు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాత్రం ఈ విషయంలో కనీసం ప్రకటన కూడా చేయకుండా మౌనంగా ఉండిపోయింది. దేశ వ్యాప్తంగా ప్రధాన పార్టీలు అన్నీ రైతు బిల్లుల రద్దు కోసం కిసాన్ మోర్చా బంద్ కు మద్దతుగా ఇవ్వగా టీఆర్ఎస్ సర్కారు అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇదే టీఆర్ఎస్ ఓ సారి మాత్రం మంత్రులతో సహా నాయకులు అందరూ రోడ్డెక్కి ధర్నాలు చేశారు. కానీ తర్వాత అకస్మాత్తుగా వైఖరి మారిపోయింది. రైతు చట్టాలు అమలు చేయకతప్పదనే రీతిలో సీఎం కెసీఆర్ ప్రకటనలు వెలువడ్డాయి. ప్రధాని నరేంద్రమోడీ అకస్మాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో శుక్రవారం నాడు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటంతో ఈ క్రెడిట్ ను కొట్టేసే పనిలో పార్టీలు పడ్డాయి. మోడీ నిర్ణయమే రైతుల కోణం కంటే రాజకీయ కోణంలో జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అయినా వరి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కెసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ మూడు, నాలుగు గంటలు ధర్నా చేస్తే మోడీ ఏకంగా రైతు చట్టాలనే రద్దు చేసి పడేస్తారా?. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన డిమాండ్ అయిన బాయిల్డ్ రైస్ కొనమని ఓ వైపు కేంద్రం స్పష్టంగా ప్రకటన చేసింది.
కెసీఆర్ నిర్ణయాలు కూడా రాజకీయాల ప్రకారమే సాగుతున్నాయి. నిజంగా రైతులకు మద్దతుగా ఉండాలనుకుంటే ఆయన భారత్ బంద్ కు అనుకూలంగా కనీసం ప్రకటన చేసి ఉండేవారు. కానీ ఆరోజు అదేమి చేయలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమితోనే సెగ తగిలి మళ్లీ రైతుల అస్త్రాన్ని బయటకు తీశారు. దక్షిణాదిలోనూ రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని..దానికి కెసీఆర్ నాయకత్వం వహిస్తారని భయపడే రైతు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందని తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి శుక్రవారం నాడు మీడియా ముందు వ్యాఖ్యానించారు. అసలు టీఆర్ఎస్ ధర్నా చేసిన ఉద్దేశం వేరు..కేంద్రంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం వేరు. అయినా సరే మంత్రులు , టీఆర్ఎస్ నేతలు ఆగమేఘాల మీద కెసీఆర్ ధర్నా వల్లే మోడీ వెనక్కి తగ్గారంటూ అటు సోషల్ మీడియాలోనూ ఇటు బయటా హోరెత్తించారు. ధర్నా చౌక్ వద్ద టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాలో కెసీఆర్ రైతుల చట్టాల అంశాన్ని కూడా ప్రస్తావించారు. కానీ టీఆర్ఎస్ ధర్నా ప్రధాన ఉద్దేశంతో యాసంగిలో తెలంగాణ రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేస్తారా?. లేదా అన్న అంశమే. కానీ మోడీ నిర్ణయాన్ని వాడుకునే పనిలో టీఆర్ఎస్ బంద్ కు మద్దతు ఇవ్వని విషయాలు..ఉద్యమం పీక్ లో సాగుతున్న సమయంలో మధ్యలో అసలు ఈ అంశాన్ని టీఆర్ఎస్ పట్టించుకోని విషయాన్ని మాత్రం కన్వీనెంట్ గా మర్చిపోయారు.