Telugu Gateway
Telugugateway Exclusives

పెళ్లి పిలుపుల తరహాలో ఈ పార్టీ పిలుపులు ఏంటో?!

పెళ్లి పిలుపుల తరహాలో ఈ పార్టీ పిలుపులు ఏంటో?!
X

మాజీ ఎంపీ, ఖమ్మం జిల్లాకు చెందిన నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరీ అతి చేస్తున్నారా?.ఆయనకు అయన చాలా ఎక్కువ ఉహించుకుంటున్నారా?. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సాగుతున్న చర్చ. ఎంత పెద్ద నాయకుడు అయినా తాను ఉంటున్న పార్టీలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఇతర పార్టీలోకి వెళతారు. ఇది వింతేమీ కాదు. దేశంలో కూడా ఎంతో పెద్ద పెద్ద నాయకులు కూడా పార్టీలు మారారు. మారే సమయంలో ఆ పార్టీ బాద్యుడు, అధినేతలతో మాట్లాడుకుని చేరటం అన్నది ఎప్పటినుంచో ఉన్నదే. కానీ పెళ్లి పిలుపుల తరహాలో తమను పార్టీ లోకి పిలవాలి...పిలిస్తే తాము అప్పుడు వచ్చి చేరతాం అన్న చందంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి సాగించిన డ్రామా కాంగ్రెస్ పార్టీ లో కూడా తీవ్ర చర్చనీయాంశగా మారింది. గతంలో ఎంతో మంది కీలక నేతలు చేరారు కానీ...ఈ తరహా పరిస్థితి ఎప్పుడూ లేదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అసలు ఏ పార్టీలో చేరాలి అనే విషయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి అండ్ కో కొనసాగించిన డ్రామానే పెద్ద ప్రహసనాన్ని తలపించింది. వాస్తవానికి ఖమ్మం జిల్లా క్షేత్ర స్థాయి పరిస్థితుల ప్రకారం చూసినా కూడా అక్కడ బలంగా ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఒకటి. ఇతర కారణాలతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీజేపీ లో చేరాలని నిర్ణయించుకున్నా కూడా ఆయనతో ఉన్న నాయకులే చాలా మంది తాము బీజేపీ లోకి అయితే వచ్చేది లేదు అని చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆయనకు మరో ఆప్షన్ లేక పోయినా కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనకున్న ఆర్థిక బలంతోనే ఈ డ్రామా అంతా నడిపించారు అని కొంత మంది కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సారి తెలంగాలో ఎలాగైనా విజయం సాధించితీరాలి అనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కూడా తగ్గి వ్యవరిస్తోంది. అధిష్టానం సూచనలు, పార్టీ గెలుపు ఎంతో కీలకం కావటంతో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరినట్లు లాంఛన ఆహ్వానం పేరుతో తెలంగాణ పీసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర కీలక నేతలు ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. దీంతో గత కొన్ని నెలలుగా సాగుతున్న తంతుకు తెరపడినట్లు అయింది అని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కి పొంగులేటి అవసరం ఎంత ఉందో..పొంగులేటి కూడా రాజకీయంగా నిలబడటాని కాంగ్రెస్ అంతే అవసరం అని ఒక నేత వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ అవకాశాలు ఒకింత మెరుగుపడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Next Story
Share it