Telugu Gateway
Telugugateway Exclusives

బిజెపి వైపు ఈటల చూపు 'ఆత్మరక్షణ' కోసమేనా?!

బిజెపి వైపు ఈటల చూపు ఆత్మరక్షణ కోసమేనా?!
X

రైతు చట్టాలను వ్యతిరేకించి..ఇప్పుడు ఆ పార్టీలోకా?

బిజెపి లో 'అత్మాభిమానం' మెండుగా దొరుకుతుందా?

అత్మగౌరవ నినాదం విన్పిస్తున్న ఈటల రాజేందర్ ఇప్పుడు 'అత్మరక్షణ' లో పడ్డారా?. తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తన విషయంలో చూపెడుతున్న దూకుడుని తట్టుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరి రక్షణ పొందాలని చూస్తున్నారా?. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను ఈటెల రాజేందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అందరూ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అలాంటి రాజేందర్ ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారని..ఇక పార్టీలో చేరటమే ఆలశ్యం అని బలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే ఆయన నిర్ణయం రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రైతు చట్టాల విషయంతోపాటు, కరోనా కట్టడి విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపై దేశ వ్యాప్తంగా బిజెపిపై తీవ్ర వ్యతిరేకత పెంచుతోంది. దీంతోపాటు కరోనా సమయంలో ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డివిరుస్తున్నారు.

ఇక నిత్యావసర ధరల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. దేశంలోని మూడ్ చూస్తే ప్రస్తుతానికి బిజెపికి వ్యతిరేకంగా ఉంది. ఈ తరుణంలో 'ఆత్మగౌరవం' నినాదం ఎత్తుకున్న ఈటల రాజేందర్ బిజెపి వైపు చూడటం చాలా మందిని విస్మయానికి గురిచేస్తోంది. పేరుకే బిజెపి జాతీయ పార్టీ అయినా మోడీ, అమిత్ షాల పట్టు పెరిగిన తర్వాత అది ప్రాంతీయ పార్టీల కంటే దారుణంగా మారిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడి,,వ్యాక్సినేషన్ తదితర అంశాల్లో కేంద్రం ఘోరంగా విపలమైనా అటు పార్టీలోనూ..ప్రభుత్వంలోనూ ఎవరూ నోరెత్తలేని పరిస్థితి. కనీసం సలహాలు ఇవ్వటానికి కూడా కేంద్ర మంత్రులు వంటి వారు కూడా సాహసించటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే..అదేదో అద్భుతాలు చేయకపోయినా కనీసం కేబినెట్ లోని కొంత మంది మంత్రులు..పార్టీ నేతలు కొంత మంది అయినా మనం వెళుతున్న దారి సరికాదని ధైర్యంగా..బహిరంగంగా చెప్పేవారు.

ఓ ప్రెజర్ గ్రూప్ గా మారేవారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యూటీ. బిజెపిలో ఇది మచ్చుకైనా కన్పించదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈటల రాజేందర్ వంటి నేత మంచి భవిష్యత్ కావాలనుకుంటే తెలంగాణలో ఎంతో బలమైన సామాజిక వర్గంగా ఉన్న బిసిలను ఏకం చేయటంతో పాటు మరికొన్ని వర్గాలను కలుపుకుని సొంతంగా ప్రయత్నం చేయటం వల్ల ఫలితం ఉంటుంది కానీ..గతంలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్న బిజెపి వైపు ఈటల రాజేందర్ చూస్తున్నారంటే ఇది కేవలం ఆత్మరక్షణ కోసమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.. ప్రజల్లో ఆ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు అందులో ఎంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నా ఏమీ ఉపయోగం ఉండదని చరిత్ర చాలా సార్లు చెప్పింది.

Next Story
Share it