Telugu Gateway
Telugugateway Exclusives

ఎన్నిక‌ల హామీల‌కూ ప‌రిమితి పెట్టాల్సిందే!

ఎన్నిక‌ల హామీల‌కూ ప‌రిమితి పెట్టాల్సిందే!
X

ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే పార్టీల‌కు స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాల్సిన బాధ్య‌త ఎన్నిక‌ల సంఘానిది. ఎన్నిక‌ల వ్య‌యం ద‌గ్గ‌ర నుంచి నామినేష‌న్ల గ‌డువు, ప్ర‌చార స‌మ‌యం ఏ పార్టీకైనా ఒక‌టే. అయితే ఎన్నిక‌ల వ్య‌యం విష‌యానికి వ‌స్తే మాత్రం ఈసీ ఆమోదించిన మొత్తం..వాస్త‌వ వ్య‌యం మ‌ధ్య అస‌లు పొంత‌నే ఉండ‌దు. అయితే ఇక్క‌డ అంశం అది కాదు. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల హామీల విష‌యంలో మాత్రం ఎన్నిక‌ల సంఘం పార్టీల‌ను ఇష్టారాజ్యంగా వ‌దిలేస్తోంది. ఇదే ఇప్పుడు ప‌లు రాష్ట్రాల‌ను తీవ్ర ఆర్ధిక స‌మ‌స్య‌ల్లోకి నెడుతంది. ఇదే ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారిపోతాయ‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇది అంతా చూస్తుంటే ఒక్క మాట‌లో చెప్పాలంటే అదికారంలో ఉన్న లేక ఇత‌ర అధికారంలోకి రావాల‌నుకునే రాజ‌కీయ పార్టీల ప్ర‌యో్జ‌నాల కోసం ప్ర‌జ‌లు భారీ ఎత్తున న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. గ‌త కొంత కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు వేలం పాటలా మారాయి. ఒక పార్టీ పెన్షన్ రెండు వేల రూపాయలు అంటే మరొకరు మూడు వేల రూపాయలు అంటారు. ఒకరు రుణ మాఫీ లక్ష రూపాయలు అంటే మరొకరు రెండు లక్షల రూపాయలు అంటారు.

అసలు నిరుద్యోగ భతి ఇవ్వటం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించిన నాయకులే చివరకు పెళ్లి చదివింపుల తరహాలో ప్రత్యర్ధి పార్టీ ఇచ్చిన మొత్తానికి 16 రూపాయల జత చేసి ప్రకటిస్తారు. ఇవన్నీ గత ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూసిన విన్యాసాలే. ఈ హామీలన్నింటిలోనూ హేతుబద్దత, అవ‌స‌రం కంటే తమ గెలుపే టార్గెట్ గా చేసిన‌వి అనే విషయం స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలటం ఖాయం. ప్ర‌తి పార్టీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రజలకు మేం అవి చేస్తాం..ఇవి చేస్తాం అని చెబుతారు కానీ..తాము అధికారంలోకి వచ్చాక ఎన్ని అప్పులు చేసి ప్రజల నెత్తిన ఎంత భారం మోపుతాం అని మాత్రం చెప్పరు. అంతే కాదు..ఏకంగా భవిష్యత్ తరాలకు, భవిష్యత్ అవసరాల కోసం కాపాడాల్సిన భూములను సైతం అమ్మేసి తామే సంక్షేమానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేసుకుంటారు. వ‌చ్చే ఎన్నికల నాటికైనా రాజకీయ పార్టీల ఎన్నికల హామీలకు పరిమితి పెట్టాల్సిన ఉంద‌ని, లేకపోతే రాష్ట్రాల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌లో అత్యంత కీలకమైన హామీల విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ (ఎస్ ఈసీ) ఘోరంగా విఫలం అవుతోంది.

పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషించే హామీల విషయంలో మాత్రం అందరికీ సమాన అవకాశాలు (Level playing field) కల్పించకుండా వదిలేయటం వల్ల ఎవరు ఎక్కువ ఆకర్షణీయ, అబద్దపు హామీలు ఇస్తారో వారే ఎన్నికల్లో విజయం సాధించటానికి ఎస్ఈసీ పరోక్ష సహకారం అందిస్తున్నట్లు అవుతోంది. ఎన్నికల కమిషన్ ప్రధాన విధుల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించటం అనేది అత్యంత కీలకమైనది. ఏ మాత్రం స‌హేతుక‌త లేకుండా కేవలం గెలుపు కోసమే ఒకరిని చూసి ఒకరు హామీలు ఇస్తూ పోతున్నారు. పార్టీల గెలుపు ఆయా పార్టీలు ప్రకటించే పరిపాలనా విధానాలు..ఆ పార్టీల నేతలు అందించే నాయకత్వం చూసి ఉండాలి తప్ప..ప్రజల సొమ్ముతో ఇచ్చే ఉచిత హామీలతో కాదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ సీఎం కెసీఆర్ రైతు రుణ మాఫీ లక్ష రూపాయలు అంటే కాంగ్రెస్ రెండు లక్షల రూపాయలు అన్నది. కెసీఆర్ రైతు రుణ మాఫీని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదు.



Next Story
Share it