ఈటెల సవాల్ కెసీఆర్ కు ఇరకాటమే!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఫలితాలు అంతా ఒకెత్తు..సీఎం కెసీఆర్ వర్సెస్ ఈటెల రాజేందర్ ఫైట్ మరో ఎత్తుగా మారబోతుందా?. అంటే ప్రస్తుతం పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి. కొద్ది రోజులుగా మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గజ్వేల్ లో పోటీ చేస్తానని..సీఎం కెసీఆర్ ను ఓడిస్తానని చెబుతూ వస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ కు దిగారు. హుజూరాబాద్ లో వచ్చే సారి ఓటమి తప్పదనే భయంతోనే ఈ ప్రకటనలు చేస్తున్నారని..ఈటెలకు అంత సీన్ ఉందా అంటూ మండిపడ్డారు. దీంతో ఈటెల రాజేందర్ ..హుజూరాబాద్ కు కెసీఆర్ వచ్చినా సరే..గజ్వేల్ లో అయినా సరే తాను కెసీఆర్ ను ఓడిస్తానని..కెసీఆర్ ను ఓడించకపోతే తన జన్మకు సార్ధకత లేదని ప్రకటించి కలకలం రేపారు. ఇప్పటికే రెండు టర్మ్ లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మెజారిటీతో గెలవటం అంటే అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అయితే రాష్ట్రంలో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయినా..బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ అయినా టీఆర్ఎస్ ను ఓడిస్తాం..తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొస్తాం అని ప్రకటించగలరు కానీ..తామే స్వయంగా రంగంలోకి దిగి సీఎం కెసీఆర్ ను ఓడిస్తామని చెప్పే సాహసం చేస్తారనుకోవటానికి ఛాన్స్ లేదు. ఈ సాహసం ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే టీఆర్ఎస్ లో సుదీర్ఘ కాలం ఉండటం, పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించటంతో ఈటెలకు తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో ఒకింత పట్టు ఉంది. పార్టీ నిర్మాణంలో కెసీఆర్, ఈటెల, హరీష్ రావుల పాత్ర ఏంటో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించటం వెనక కూడా ఇదే కారణం.
నిజంగా ఈటెల రాజేందర్ నిన్న తన మీడియా సమావేశంలో పార్టీ నిర్మాణం విషయంలో హరీష్ రావు పేరు తీయకపోయింటే ఆయనకు విశ్వసనీయత వచ్చేదికాదు. హరీష్ రావు పేరు తీయటం ద్వారా ఈటెల రాజేందర్ విశ్వసనీయ పెంచుకున్నారని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో నిజంగా కెసీఆర్ ను ఈటెల రాజేందర్ ఓడించగలరా?. ఏ నియోజకవర్గం నుంచి అసలు కెసీఆర్ బరిలోకి దిగుతారు అన్న సంగతి ఇప్పట్లో తేలేది కాదు. కెసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ రెడీ అనే తరహాలో ఈటెల రాజేందర్ ప్రకటనలు చేస్తుండటం రాజకీయం వర్గాల్లో మాత్రం హాట్ హాట్ చర్చకు కేంద్రంగా మారింది. అలా కాకుండా కెసీఆర్ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లు లోక్ సభ బరిలో నిలిచినా రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తానికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ ను ఈటెల రాజేందర్ మాత్రం ఇరకాట పరిస్థితిలోకి నెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ నాయకులు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో ఓటమి తప్పదని తెలిసే..గజ్వేల్ రాగం అందుకున్నారని టీఆర్ఎస్ నేతలు ప్రకటన చేసిన గంటల్లోనే ఈటెల హుజూరాబాద్ లో అయినా..గజ్వేల్ అయినా తాను రెడీ అని ప్రకటన పెద్ద సంచలనంగా మారింది.