హైదరాబాద్ ఆదాయం అప్పుడు 23 జిల్లాలకు..ఇప్పుడు పది జిల్లాలకు
దేశాన్నిసాకుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇది సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు పదే పదే చెప్పే మాట. కాసేపు ఆ సంగతి పక్కన పెట్టి ఒకప్పుడు 23 జిల్లాలను సాకిన హైదరాబాద్ ఇప్పుడు కేవలం పది ఉమ్మడి జిల్లాలను మాత్రమే సాకుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉండాలి...అది ఏ రేంజ్ కు వెళ్ళాలి. కానీ అలా వెళ్లిందా...కెసిఆర్ నిజంగానే తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశారా?. ఇందులో నిజానిజాలు ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు అంటే 2014 కు ముందు హైదరాబాద్ ఆదాయం 23 జిల్లాలకు ఖర్చు పెట్టేవాళ్ళు. అది జిల్లాలకు సమానంగా పంపిణి జరగకపోయినా రాష్ట్ర మంతా ఒక యూనిట్ గా ఆ ఖర్చు ఉండేది. అప్పటి టిఆర్ఎస్..ఇప్పటి బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం తెలంగాణ సొమ్ము అంతా ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు అని విమర్శించే వాళ్ళు. ఉద్యమ సమయంలో ఈ వాదన కూడా బాగానే పనికొచ్చింది. 2014 జూన్ లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన విషయం తెలిసిందే. అంటే అప్పటి నుంచి 23 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం యూనిట్ పై చేసే ఖర్చు అంతా 2014 జూన్ నుంచి పది జిల్లాల తెలంగాణకు మాత్రమే. సీఎం కెసిఆర్ తెలంగాణాలో జిల్లాల సంఖ్యను 33 కు పెంచినా కూడా భౌగోళికంగా తెలంగాణలో ఎలాంటి మార్పు లేదు అనే విషయం తెలిసిందే. అటు ఉమ్మడి రాష్ట్రంలో అయినా...ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయినా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు రాజధాని నగరం హైదరాబాద్ అనే విషయం అందరికి తెలిసిందే. మరి ఒకప్పుడు 23 జిల్లాలకు ఉపయోగించిన హైదరాబాద్ నగరం ఆదాయం ఇప్పుడు పాత పది జిల్లాలకు మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు వచ్చినప్పుడు అసలు తెలంగాణాలో అభివృద్ధి ఎంత అద్బుతంగా జరగాలి. అప్పుడైనా..ఇప్పుడైనా రాష్ట్ర ఆదాయంలో అరవై నుంచి డెబ్భై శాతం వరకు హైదరాబాద్, రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల నుంచే వస్తుంది అని అధికారులు చెపుతున్నారు.
విభజన తర్వాత హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా ఆదాయం మొత్తం తెలంగాణ కే అన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే హైదరాబాద్ నగరంలో అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం..ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) ప్రాజెక్ట్ లు రాష్ట్రం ఏర్పడక ముందే ఉండగా.. హైదరాబాద్ మెట్రో వంటి కీలక ప్రాజెక్ట్ అప్పటికి చాలా పురోగతిలో ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరు తర్వాత హైదరాబాద్ దేశంలోనే రెండవ అతి పెద్ద ఐటి కంపెనీల కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. అప్పటికే అభివృద్ధి అయి ఉన్న మౌలిక వస్తులు...వివిధ కారణాలతో గత పదేళ్ల కాలంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు పలు రంగాలు దూసుకెళ్లాయి. దీంతో ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అలాంటప్పుడు పది ఉమ్మడి జిల్లాలకు పరిమితం అయిన తెలంగాణాలో అభివృద్ధి ఏ రేంజ్ లో ఉండాలి..కానీ ఉండాల్సినంత స్థాయిలో లేదు అని ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులే చెపుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు చేయని రీతిలో కెసిఆర్ సర్కారు అప్పులు చేసింది అనే విమర్శలు ఉన్నాయి. కెసిఆర్ సర్కారు ఇప్పటివరకు చేసిన అప్పులు అన్ని కలిపి దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల వరకు ఉన్నాయి. ఇవి చాలవు అన్నట్లు గతంలో ఎన్నడూ లేని రీతిలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా కెసిఆర్ సర్కారు ఎడా పెడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో అమ్మినట్లు భూములు అమ్మిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రం తో పాటు గతంలో ఎన్నడూ కూడా సాగునీటి ప్రాజెక్ట్ ల కోసం బ్యాంకు లు...ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్ లు కట్టిన చరిత్ర కూడా లేదు.
ఇది అంతా ఒక ఎజెండా ప్రకారమే చేశారు అని అటు అధికారులు..ఇటు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ...దేశంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటూ కెసిఆర్ చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అసలు గుట్టు ఇప్పుడు బయటపడుతున్న విషయం తెలిసిందే. అంత మాత్రాన కెసిఆర్ పదేళ్ల పాలనలో ఏమీ జరగలేదు అని ఎవరూ చెప్పారు. కానీ హైదరాబాద్ వంటి అద్భుతమైన నగరం నుంచి వచ్చే ఆదాయం ఉమ్మడి పది జిల్లాలకు మాత్రమే వాడుకునే వెసులుబాటు ఉన్నప్పుడు....ఇన్ని భారీ అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది...ఇంత పెద్ద ఎత్తున భూములు ఎందుకు అమ్మినట్లు?. ఇవన్నీ చూస్తే తెలంగాణాలో జరగాల్సిన అభివృద్ధి జరగలేదు అన్నది అధికారుల మాట. మరో వైపు తెలంగాణ విద్యుత్ రంగం ఏ క్షణంలో అయినా కుప్పకూలే అవకాశం ఉంది అని ఈ రంగంలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా విద్యుత్ రంగ సంక్షోభ ప్రభావం తెలంగాణ ప్రజలపై పడటం ఖాయం ఎన్ని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో కొత్తగా ఫ్లై ఓవర్లు, ఇతర మౌలిక వసతులు కలిపించినా కూడా అందులో కూడా మెజారిటీ పనులు ఎస్ఆర్ డీపీ కింద అప్పులు తెచ్చినవే అని చెపుతున్నారు.